తస్మాత్‌ జాగ్రత్త!

స్టార్‌హోటళ్లు.. అందులోనూ జనంలో బాగా పేరొందిన పెద్దపెద్ద హోటళ్లు. అందులో ఏ ఒక్కదానిలో అడుగుపెట్టినా… వినయంగా వెల్‌కమ్‌ పిలుపులు… ఏసీలు అందించే చల్లని గాలుల మధ్య సుతిమెత్తగా కూర్చునే సోఫాలు, టేబుల్‌పై నీట్‌గా సర్దిన ప్లేట్లు.. గ్లాస్‌లు. పైన డిమ్‌లైట్లు.. సాధారణంగా దర్శనమిస్తాయి. మర్యాదగా ఆర్డర్‌ తీసుకుని అంతే వినయంగా వడ్డించే వెయిటర్లు.. ఇవన్నీ లగ్జరీగా కనిపిస్తాయి. కానీ ఎంత మందికి తెలుసు… ఆయా హోటళ్లలో తినే ఫుడ్‌ రోజులతరబడి ఫ్రిడ్జ్‌ల్లో దాచి వేడి చేసి తీసుకొస్తున్నారని….ఎంత మందికి తెలుసు..? ఆయా కిచెన్‌ గదులన్నీ దుర్గంధభరితంగానూ, స్వైరవిహారం చేసే బొద్దింకలు, ఎలుకలు ఉన్నాయని, ఎంత మందికి తెలుసు గడువుముగిసిన వంటసామాగ్రితో కుళ్లిన కూరగాయలు, మాంసంతో వండివార్చుతున్నారని.. ఇవన్నీ రెండు రోజులుగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీల్లో వెలుగుజూస్తుండటం ఇప్పుడు నగర ప్రజలు ఆందోళనకు గురి చేస్తోంది.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/ భగత్‌నగర్‌
పేరున్న హోటళ్లలోనే అధికారుల తనిఖీలు.. కొందరికి నోటీసులు జారీ
నగరంలోని శ్వేత హోటల్లో ఆదివారం తనిఖీలు చేపట్టిన అధికారులు విస్తుపోయే విషయాలు గుర్తించారు. ఏమాత్రమూ శుచీశుభ్రత లేని వంటగదిని కంపుకొడుతున్న స్టోర్‌ రూమ్‌… కుళ్లిపోయిన చికెన్‌, మటన్‌ ఫ్రాన్స్‌లను గమనించిన అధికారులు శ్వేత హోటల్‌లో గడువు ముగిసిన రూ.70వేల ఖరీదైన ప్రొడక్ట్స్‌ను గుర్తించారు. కిచెన్‌లో 20 నుంచి 25 రకాల వండిన పదార్థాలను గుర్తించారు. ఈ సందర్భంగా శ్వేత హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. సోమవారం సైతం నగరంలోని పలు హోటళ్లను తనిఖీ చేశారు. అందులో క్రితింగ రెస్టారెంట్‌లో గడువుముగిసిన పప్పీసీడ్స్‌, పప్పుదినుసులు, జీరా, మసాలా పౌడర్‌, నూడిల్స్‌, మిరపపొడి, పచ్చిబఠాణీ వంటి పదార్ధాలను రూ.6వేల విలువజేసే 12కేజీలను గుర్తించారు. కనీసం గాలి ఆడని స్టోర్‌రూమ్‌ ఉన్నట్టు గుర్తించారు. మైత్రీ హోటల్‌లోనూ తనిఖీ చేసిన అధికారులకు గడువుముగిసిన పదార్థాలు ఏమీ లేకపోగా.. అనుమానం వచ్చిన కొన్ని ఫుడ్‌ ఐటెమ్స్‌, గోధుమ పిండిని ల్యాబ్‌కు పించారు. అలాగే హోటల్‌ పికాక్‌ ప్రైడ్‌లోనూ తనిఖీ చేసిన అధికారులు అక్కడ కూడా అనుమానం వచ్చిన వంటసామాగ్రిని, ఫుడ్‌ను హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్‌కు పంపించారు. ఇలా మరిన్ని హోటళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు.

Spread the love