వరండాలే.. తరగతి గదులు..

– ఒకే గది 5 తరగతులు…
– అసౌకర్యాల మధ్య విద్యార్థులకు విద్య బోధనలు….
నవతెలంగాణ తంగళ్ళపల్లి
అసౌకర్యాల మధ్య విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల వరండాలే విద్యార్థులకు తరగతి గదులుగా మారాయి. తంగళ్ళపల్లి మండలంలో ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలలో దాదాపుగా రెండు రూములు మాత్రమే అప్పటి ప్రభుత్వం నిర్మించింది. నిర్మించిన రెండు తరగతులలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు ఆ గ్రామంలో చదువుకునే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కానీ ప్రభుత్వం నిర్మించిన ఆ రెండు తరగతి గదుల్లో ఒక గది పాఠశాల కార్యాలయ నిర్వహణకు ఆఫీసు రూమ్ గా ఏర్పాటు చేస్తే మరొక తరగతి గదిలో విద్యార్థులకు విద్యాబోధనలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పలుచోట్ల విద్యార్థులకు బెంచీలు,డేస్కులు లేకపోవడంతో కిందనే కూర్చొని చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నచోట ఉపాధ్యాయులను డిపిటేషన్ పై మరో పాఠశాలకు పంపిస్తున్నారు. తద్వారా ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులను నిర్వహిస్తున్నారు. ఒకే ఉపాధ్యాయుడు పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు విద్యాబోధన, ఐదు తరగతిల నిర్వహణ చేయడం ద్వారా ఉపాధ్యాయులపై అధిక పని భారం పడుతుందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. తంగళ్ళపల్లి మండలంలో కేవలం రెండు గదులు ఉన్న పాఠశాలలు వేణుగోపాల్ పూర్, బాలమల్లు పల్లె, పద్మ నగర్, సారంపల్లి, మల్లాపూర్, నరసింహులపల్లి, జిల్లెళ్ళ ఎక్స్ రోడ్, భరత్ నగర్, రాళ్లపేట, ఇందిరానగర్, గాంధీ నగర్ పాఠశాలల్లో రెండు గదులు మాత్రమే ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు విద్య బోధనలు చెబుతున్నారు. కానీ బాలమల్లు పల్లె, జిల్లెల్ల ఎక్స్ రోడ్ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉండడంతో ఈ పాఠశాలల్లోని ఒక్కొక్క ఉపాధ్యాయుని డిప్యూటేషన్ పై మరో పాఠశాలకు అధికారులు పంపించారు.

ఇద్దరే ఉపాధ్యాయులు…

ప్రాథమిక పాఠశాలలు ఉన్న చోట కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్కూల్ నిర్వహణ నిర్వహిస్తూనే ఆఫీస్ రూమ్ లో విద్యార్థులను కూర్చోబెట్టుకొని ఇటు కార్యాలయం నిర్వహణ అటు విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. మరొక ఉపాధ్యాయుడు ఒకే గదిలో మూడు క్లాసులను విద్యార్థులను కూర్చోబెట్టుకొని వారికి విద్య బోధనలు చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు ఏ సమయంలో ఏ తరగతికి పాఠాలు చెబుతున్నారో అర్థం కాక విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒక్కరు సెలవు పెడితే ఆరోజు మొత్తం పాఠశాల నిర్వహణ ఒక్కరే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఐదు తరగతుల నిర్వహణ ఒక్క ఉపాధ్యాయుడే ఒకే గదిలో నిర్వహిస్తారు.

అసౌకర్యాల మధ్య విద్యాబోధన…

ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేక అనేక ఇబ్బందుల మధ్య విద్యార్థులు చదువుకుంటున్నారు. పూర్తిస్థాయిలో బెంచీలు, డెస్క్ లు లేక విద్యార్థులు కింద కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు విద్యార్థులకు తలెత్తుతున్నాయి. అంతేకాదు పూర్తిస్థాయిలో ప్రతి తరగతికి తరగతి గదులు లేకపోవడంతో ఒకే గదిలో మూడు లేదా నాలుగు తరగతుల నిర్వహణ జరుగుతుంది. వీటికి తోడు వరండాల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబోధనలు చేస్తున్నారు రోడ్డుపై వెళ్లే వాహనాల వల్ల దుమ్ముదులి విద్యార్థులపై చేరి విద్యార్థులు అనారోగ్య పాడిన పడుతున్నారు.వీటికి తోడు ఉపాధ్యాయులు తమ ద్విచక్ర వాహనాలను ఎండకు చెడిపోతాయని ఉద్దేశంతో  విద్యార్థులు చదువుకునే వరండాలో పార్కింగ్ చేస్తున్నారు.

పాఠశాలలో ఉండేది కేవలం రెండు గంటలే…
మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలలో కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటుంది. మండలంలోని పద్మనగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సుధారాణి అనే ప్రధాన ఉపాధ్యాయురాలు నిత్యం ఉదయం 10 గంటలకు పాఠశాలకు వచ్చి మధ్యాహ్నము 12 గంటలకే తిరిగి ఇంటికి వెళ్లి పోతుంది. ఇలా చాలా కాలంగా జరుగుతున్న ఉన్నత స్థాయి అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. అధికారులే చూసి చూడనట్టుగా వివరించడంతో ఆ ఉపాధ్యాయురాలు నిత్యం ఇదే పనిగా పెట్టుకుంది.అంతేకాదు ఆమె స్థానంలో ఒక విద్యా వాలంటరీ ఏర్పాటు చేసి తనే నెలకు జీతం నుండి కొంత డబ్బు ఆ విద్య వాలంటర్ కు అందిస్తున్నారు. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియకుండానే విద్య వాలంటరీ ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు.

Spread the love