నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా మిషన్ భగీరథ ఇంజినీరింగ్ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘మంచినీళ్ల’ పండుగను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అద్భుతాన్ని మరోసారి ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నది. రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలు జనంలోకి తీసికెళ్లనున్నారు. ఈమేరకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మీతా సభర్వాల్ వచ్చే సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ జి కృపాకర్‌రెడ్డి మంచినీళ్ల పండుగకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఎలా నిర్వహించాలో రాష్ట్ర అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చిన వైనాన్ని మంచినీళ్ల పండుగ ద్వారా వివరించనున్నారు. భారీ పైపు లైన్లు, ట్యాంకులు, వాటర్ ట్రీట్‌మెంటు పాంట్లు(డబ్ల్యూటీపీ), జీఎల్‌బీఆర్లు తదితర నిర్మాణాలను ప్రజలకు, మీడియాకు చూపించాలని భావిస్తున్నారు. అలాగే సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో చెప్పినట్టుగా రూ.42 వేల కోట్లు కాకుండా, కేవలం రూ. 36 వేల కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అవతరణ ఉత్సవాల్లో మిషన్ భగీరథ విశిష్టతను రాష్ట్ర ప్రజానికానికి వివరిస్తామని ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. మంచినీళ్ల పండుగ షెడ్యూల్‌ను వచ్చే సోమవారం ప్రకటిస్తామని వివరించారు.