భక్తి – యుక్తి

సత్యభామ మందిరంలో కృష్ణుడు గాఢంగా నిద్రి స్తున్నాడు. ఇంతలో సత్యభామ వచ్చింది. నాధుడిని చూసి సంశయించింది. నిద్రపోతున్న కృష్ణుడిని లేపా లని అనిపించటం లేదు కాని తాను చూసిన దృశ్యం ఆమెను నిలబడ నీయటం లేదు! ఆ దృశ్యాన్ని నాధుడికి చూపించాలని ఆమె ఆరాటం! ఏదైతేనేం నిద్ర లేపాలనే నిర్ణయించు కున్నది! పైగా ఆయన నిద్రపోతున్నాడో లేక నటిస్తున్నాడో! అలాంటి వాటిల్లో ఆయన సిద్ధహస్తుడు కదా! అనుకున్నది.
”స్వామీ! నిద్రలేవండి! ఆ అపురూప దృశ్యాన్ని వీక్షిం చండి! అంటూ శ్రీకృష్ణుడిని నిద్రలేపింది సత్యభామ.
”అబ్బా! ఏమిటీ సత్యా అలసిపోయి పడుకుంటిని! నిద్ర లేపితీవేమి?” అంటూ లేచాడు కృష్ణుడు.
”చూడండి! స్వామీ ఆ అపురూప దృశ్యాన్ని!”అంటూ కిటికీలో నుండి ఓ దృశ్యాన్ని చూపింది! సత్యభామ.
”అబ్బా! నిద్రమత్తులో ఉన్నాను కదా సత్యా! నీవే వివరించరాదా?” అన్నాడు శ్రీ కృష్ణుడు.
”అయ్యో! ఈ కలియుగంలో కూడా మీ దర్శనం కోసం ఆ వృద్ధ భక్తుడు ఎంత తాపత్రయ పడుతున్నాడు. సముద్ర గర్భంలో మునిగిన మన ఈ ద్వారకకు వచ్చి మీ దర్శనం చేసుకోవాలని తపన పడుతున్నాడు!” అన్నది సత్యభామ ఆ వృద్ధుడిని పరిశీలనగా చూస్తూ.
శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వాడు.
ఆ వృద్ధ భక్తుడిని చూస్తుండగా సత్యభామకు ఆనందం, అనుమానం రెండూ ఏకకాలంలో కలిగాయి.
”స్వామి! ఆ వృద్ధుడికి మీపై ఎంత భక్తి చూడండి! మీ కోసం నెమలి పింఛముల పెద్ద మోపునే తీసుకుని వచ్చుచున్నాడు! అన్నది సత్యభామ మురిపెంగా!
”నాకు ఒక్క పింఛమే చాలును! కట్టెల మోపు వంటి పింఛముల మోపు నాకేల?” అన్నాడు విసుగ్గా కృష్ణుడు.
”ఓహో! మీకు ఇష్టమైన వెన్న ముద్దలు తీసుకుని రాలేదని బాధ పడుతున్నట్లున్నారు! సముద్రములో వెన్న ముద్దలు తెచ్చి మీకు సమర్పించుట సాధ్యమా స్వామీ! మీ భక్తుడికి ఇంగింత జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేస్తే ఎలా స్వామీ!” అన్నది సత్యభామ.
మరోసారి చిన్నగా నవ్వాడు కృష్ణుడు.
మీ నవ్వులే మా ఆడపిల్లల పాలిట మన్మధ బాణాలు! ఇక నవ్వకండి! నాదో సందేహం! మీ దర్శ నానికి వస్తూ. ఆ వృద్ధ భక్తుడు, తల మీద శిరస్త్రాణం, వంటి నిండా కవచాలు ధరించి, కొందరు అంగరక్షకు లను కూడా తోడ్కొని వస్తున్నాడు! ఇంతకు అతడు మీ దర్శనం కోసమే వస్తున్నాడా! లేక మీపై యుద్ధానికి వస్తున్నాడా?” అడిగింది సత్యభామ.
మళ్ళీ నవ్వాడు కృష్ణుడు.
”నవ్వింది చాలు! నాకు సందేహం నివృత్తి చేయండి స్వామీ!” అన్నది సత్యభామ.
”సత్యా! అది శిరస్త్రాణము కాదు! కవచములూ కావు! దానిని స్కూబా డైవింగ్‌ సూట్‌ అందురు! అది లేని ఏడల సముద్రము నందు మునిగి జీవించుట అసం భవము!” వివరించాడు కృష్ణుడు.
”ఎంత భక్తి! ఎంత భక్తి! ఆ వయస్సులో మీ దర్శనం కోసం ఇన్ని పాట్లు పడుతున్నాడంటే మీపై ఎంత భక్తి ఉందో చూడండి!” అన్నది సత్యభామ.
”పిచ్చి సత్యా! మనము చూడవలసిందిగా పైనున్న వలువల గురించి కాదు! లోనున్న విలువ గూర్చి!” అన్నాడు కృష్ణుడు.
”మీ భక్తుడిని చులకన చేయటం మీకు తగదు!” అన్నది సత్యభామ నిష్టూరంగా.
”పదే పదే అతడిని నా భక్తుడని సంభోదించకు దేవీ!” అన్నడు కృష్ణుడు ఆగ్రహంగా.
కృష్ణుడి ఆగ్రహం చూసి, సత్యభామ ఆశ్చర్య పోయింది! తనపై నాథుడికేనాడూ ఇంత ఆగ్రహం కన్పించనే లేదు!
”ఇంతకూ అతడెవరో తెలుసుకోవచ్చునా!” అన్నది సత్యభామ.
”అతడు భారతదేశ ప్రధానమంత్రి!” అన్నాడు కృష్ణుడు.
”మరి ప్రజలు ఎన్నుకున్న ప్రధాని మీ దర్శనార్థం వస్తే ఆగ్రహం ఎందుకు? స్వామీ!” అన్నది సత్యభామ.
”ప్రజలు ఎన్నుకున్న ప్రధాని నా దర్శనార్థం రావటమే నా ఆగ్రహానికి కారణం!” అన్నాడు కృష్ణుడు.
”నేను చెప్పిన వాక్యమే నాకు తిప్పి చెబుతు న్నారు. ఈ ప్రతిబింభ అలంకారమేమిటి స్వామీ?” అన్నది సత్యభామ.
”సత్యా! రాజన్న వాడికి ప్రజలను పరిపాలించుటే ప్రథమ కర్తవ్యము! భారతదేశము లాంటి ప్రజాస్వామ్య దేశములో ప్రధానికి అన్నింటికన్నా ప్రథమం. ప్రజల సమస్యలు పరిష్కరించటమే! అది వదిలేసి ఇలా దైవ దర్శనాలు చేయటమంటే తన బాధ్యత విస్మరించటమే! ఇదే నా ఆగ్రహ కారణం!” వివరించాడు కృష్ణుడు.
”కొంచెం వివరించండి స్వామీ!” అన్నది సత్యభామ.
”భారతదేశంలోని ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కోంటూ ఇబ్బందులు పడుతున్నారు. గత సం|| కాలంగా మణిపూర్‌లోని జాతుల మధ్య ఘర్ష ణలు చెలరేగి వందల సంఖ్యలో ప్రజలు ప్రా ణాలు కోల్పోయారు! ఆస్థి నష్టం, మానభంగం లాంటివి ఎన్ని జరిగియో తెలియదు! కాని మణిపూర్‌కి వెళ్ళటానికి ఈ రోజు వరకు ప్రధానికి తీరిక దొరక లేదు!” అన్నాడు కృష్ణుడు.
”మణిపూర్‌ బాగా దూరంగా ఉందేమో స్వామీ!” అన్నది సత్యభామ.
”పిచ్చిదానా! ఒక ప్రధానికి దూరం ఒక లెక్కా! ఢిల్లీకి కూత వేటు దూరంలో రైతులు మేము పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఢిల్లీకి బయలుదేరితే, శత్రు సైనికులకు వ్యతిరేకంగా మోహరిం చినట్లు ముండ్ల కంచెలు, ఇనుప ముండ్లు మొ|| మార్గ ములో వేశారు. రైతుల మీద తుపాకులతో కాల్పులు జరిపి ఒక రైతును కాల్చి చంపారు. దేశానికి అన్నం పెట్టే రెతును కాల్చి చంపుటకు ఈ ప్రధానే బాధ్యత వహిం చాల్సి ఉన్నది. ఈ రోజు వరకు రైతులతో చర్చించలేదు. వారి కష్టసుఖా లేవో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. రైతుల సమస్యలు పట్టించుకునే తీరికలేదు! గాని లక్షదీప్‌కి వెళ్లి ఫొటోలు దిగే తీరిక ఉన్నది! ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శిం చేందుకు సమయం దొరకదు కాని, దేశంలోని గుళ్లూ గోపురాలు తిరగటానికి మాత్రం కావల్సిన సమయం దొరుకు తున్నది.ఆ దేశ ప్రధానిగా ప్రజల సమస్యలు పట్టించుకునే నా దర్శనం కోసం వెంపర్లాడాల్సిన అవసరమే లేదు” అన్నాడు కృష్ణుడు.
నిజమేనన్నట్లు సత్యభామ తల పంకించింది.
గత పదేండ్లుగా ఈ ప్రధానిది ఇదే తంతు! కీల కమైన ప్రజా సమస్యలు పరిష్కరించటం మానేసి, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి కొత్త సమస్యలు ప్రజల నెత్తి న రుద్దుతున్నారు. దేశంలోని ప్రజలు నానాటికీ పేదరి కంలో కూరుకుని పోతుంటే పదుల సంఖ్యలో కొందరు శతకోటీశ్వరులుగా తయారైపోతున్నారు. ఈ ప్రధాని తీసుకునే చర్యలన్నీ శతకోటీశ్వరుల బొక్కసాలు నింపేస్తు న్నాయి! ఈ లోగుట్టు దేశ ప్రజలకు తెలియకూడదని, గుళ్లూ, గోపురాలు తిరుగుతూ భక్తి ప్రదర్శనలు యుక్తిగా చేస్తున్నారు! వాస్తవాలను దేశ ప్రజలు తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉంది!” అంటూ ముగించాడు కృష్ణుడు.
– ఉషాకిరణ్‌

Spread the love