మందుబాబులకు బిగ్ షాక్.. లిక్కర్ ధరలు పెంపు..?

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కారు ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వెంటనే పెంచడమా? లేక కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడమా? అనే కోణంలో ఆరా తీస్తున్నది. ఇప్పటికిప్పుడు ధరలు పెంచితే కలిగే లాభనష్టాలపై బేరీజు వేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచడం సాధారణం. రెండు సంవత్సరాల క్రితం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే విమర్శలు వస్తాయనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ధరలు పెంచితే ప్రతి ఏటా ప్రభుత్వానికి అదనంగా రూ.3 వేల నుంచి రూ.3.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే చాన్స్ ఉంటుందని సర్కారు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. 2022 మార్చిలో అప్పటి ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది. దాని ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే ధరలను సవరించాల్సి ఉండగా పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఏ మేరకు ధరలను పెంచవచ్చనే కోణంలోనూ సర్కారు ఆరా తీస్తున్నట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ లిక్కర్ రేట్లను సవరిస్తే, వచ్చే రాజకీయ విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Spread the love