విశాఖ ఫ్లై ఓవర్ పై అదుపుతప్పిన బైక్.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – విశాఖపట్నం: విశాఖపట్నంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్ఏడీ ఫ్లైఓవర్ పై ఓ బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టింది. ఆ వేగానికి బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలతో ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోగా.. మూడో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలో డ్యూక్ బైక్ ఒకటి వేగంగా దూసుకురావడం కనిపిస్తోంది. టర్నింగ్ లోనూ అదే వేగంతో వెళ్లడంతో బైక్ అదుపుతప్పి వాల్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ అక్కడే పడిపోగా.. యువకులు మాత్రం ఫ్లైఓవర్ నుంచి కిందపడ్డారు. పై నుంచి పడడంతో యువకులు ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు మూడో యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టినట్లు తెలిపారు.

 

Spread the love