పండగ పూట బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం

నవతెలంగాణ ఐనవోలు : శాసన మండలి వైస్ ఛైర్మన్ సహా బీఆర్ఎస్ నేతలకు ఐనవోలు మల్లన్న జాతరలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. చారిత్రక క్షేత్రం ఐనవోలు ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకొని ఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఐనవోలు మల్లన్నను దర్శనం చేసుకోవడానికి శాసన మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి, హనమకొండ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ రైతు రుణవిమోచన కార్పొరేషన్ ఛైర్మన్ నాగూర్ల వేంకటేశ్వర్లు  తదితరులు వచ్చారు.

మల్లన్న దర్శనం కోసం వెళ్లే క్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఆపారు. దర్శనం టికెట్ చూపాలని కోరారు. అప్పటికే అధికారులు చెప్పడంతో డీసీసీబీ ఛైర్మన్ రవీందర్రావు రూ.50 వేలతో 100 టికెట్లను కొనుగోలు చేశారు. అవి చూపినప్పటికీ పాలకులు, పోలీసులు, దేవాదాయశాఖ అధికారులు ముఖద్వారం వద్ద తాళం వేసి అరగంట సమయం వారిని నిలిపివేశారు. అనంతరం ఎలాంటి ఆర్భాటం లేకుండా స్వామివారిని బీఆర్ఎస్ నేతలు మల్లన్నను దర్శించుకున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదని, ప్రసుత్తం అధికారులు, ఉత్సవ కమిటీ అత్యుత్సాహం ప్రదర్శించారని నేతలు మీడియాతో వాపోయారు.

ఈవో వివరణ: జాతర రద్దీ దృష్ట్యా ప్రముఖులు ఎవరైనా వస్తే రూ.500 లో టికెట్ తీసుకొవాలని పాలక మండలి నిర్ణయించింది. ఇది అధికార, ప్రతిపక్ష నేతలందరికి వర్తిస్తుందని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు నాగరాజు సమక్షంలోనే ఈ నిర్ణయం చేసినట్టు ఈవో తెలిపారు.

Spread the love