పూర్తి స్థాయి మెజారిటీయే లక్ష్యం
ఎన్నికల కమిషన్ రాజీ : సీపీఐ(ఎం) విమర్శ ఈసీ వ్యవహార శైలిపై విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయం
న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధనే లక్ష్యంగా బీజేపీ ప్రతిపక్ష పార్టీల్లో చీలికలకు పాల్పడుతోందని తద్వారా రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని సీపీఐ(ఎం) విమర్శించింది. అలాగే నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అనేక అంశాల్లో రాజీ పడిందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరుతూ విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది. జూన్ 26, 27 తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో రామ మందిర విరాళాల దుర్వినియోగం, పరీక్షా పత్రాల లీకేజీలు సహా పలు అంశాలపై సవివరంగా చర్చించింది. అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది.
బీజేపీ ఆపరేషన్ లోటస్
ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే బీజేపీ ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడంలో బిజీ అయ్యింది. మహారాష్ట్రలోని శివసేన, ఎన్‌సీపీ, ఢిల్లీ, పంజాబ్‌ల్లో ఆప్‌లో చీలికలు తీసుకువచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌ను చీల్చింది. ఆ తర్వాత శివసేన (యూబీటీ)లో మరో చీలిక సంభవించింది. ఇక సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తదుపరి బాటలో ఉందని బీజేపీ నాయకత్వంలో ఒక గ్రూపు చెబుతోంది. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ, పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధనే లక్ష్యంగా వాటిని చీలుస్తోంది. ఈ మెజారిటీని గనక సాధించినట్లైతే, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించడానికే కాదు, హిందూత్వ – మనువాద ఎజెండాను అమలు చేసేందుకూ కీలకమైన ఇతర అనేక బిల్లులను కూడా ఆమోదించడానికి వీలుంటుంది. ఈ చర్యలన్నీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాలను అప్రస్తుతం లేదా అసంబద్ధం చేస్తున్నాయి. దీంతో రాజ్యాంగ సూత్రాలను బీజేపీ ధిక్కరిస్తున్న తీరు మరోసారి బహిర్గతమవుతోంది.
పౌరసత్వ వివాదం
పౌరసత్వానికి పాస్‌పోర్ట్ గుర్తింపు పత్రం కాదని ఇటీవల విదేశాంగ శాఖ చేసిన ప్రకటన కేవలం పాలనా పరమైన తప్పిదమో లేదా లోపమో కాదు. బీజేపీ తీసుకువచ్చిన వివక్షాపూరిత పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర పట్టికకు అనుబంధంగా ఉండేలా కుటిలత్వంతో, ఒక పద్ధతి ప్రకారం చేసిన దాడి. అభ్యంతరకరమైన ఈ విపరీత ప్రకటనతో అత్యంత చట్టబద్ధమైన రీతిలో ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు కూడా పూర్తిగా నిష్ఫలమయ్యాయి. పైగా ప్రస్తుతం ఆందోళనకర రీతిలో కొనసాగుతున్న సర్ ప్రక్రియతో ఇది సరిపోలుతోంది. సమన్వయంతో కూడిన ఇటువంటి ఎత్తుగడలను వేటికవి విడివిడిగా జరిగిన పాలనాపరమైన పొరపాట్లుగా చూడలేం. దేశ జనాభాలో అత్యంత బలహీన వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేస్తూ, వారి చట్టబద్ధతను నిర్మూలించి, వారి మాతృభూమిలోనే వారిని పౌరసత్వం లేనివారిగా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా, నీచపుటెత్తుగడలతో అమలు చేస్తున్న వ్యూహం.
ఓటర్ల జాబితాలో పేరు లేదన్న సాకుతో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మాజీ సంపాదకుడి పాస్‌పోర్టును పునరుద్ధరించడానికి నిరాకరించడం చూస్తుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. ఒకపక్క బెంగాల్‌లో ఓటర్ల జాబితాలో తన పేరును తొలగించడంపై ఆయన చేసుకున్న అప్పీల్ ఇంకా పెండింగ్‌లో ఉండగానే ఇదంతా జరిగింది. పౌరసత్వం నిర్వచనాన్ని ఒక ఆయుధంగా మార్చుకోవడం ద్వారా మతపరమైన పౌర పట్టిక రూపొం దించడానికి ప్రభుత్వం పునాది వేస్తోంది. అదే సమయంలో ఎవరినైతే మినహాయించాలని భావిస్తున్నారో వారి ప్రజాస్వా మ్యబద్ధమైన ఓటు హక్కును కూడా తొలగిస్తోంది. ఈ దాడులను పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తోంది. తొలగించిన అన్ని పేర్లను పునరుద్ధరించాలని కోరు తోంది. అధికార పత్రాల చట్టబద్ధతపై ఎలాంటి అసందిగ్ధతకు తావులేని రీతిలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతోంది.
పరీక్షల నిర్వహణలో సంక్షోభం
తాజాగా నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ పరీక్షా పత్రాల లోపభూయిష్ట మూల్యాంకనం, సీయూఈటీ నిర్వహణలో పదే పదే ఇబ్బందులు తలెత్తడంలో వివిధ పరీక్షలను నిర్వహించడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అసమర్ధత మరోసారి తెరపైకి వచ్చింది. గత 12ఏండ్లుగా, 25కి పైగా కేంద్ర పరీక్షా పత్రాలు లీకయ్యాయి. ఇటువంటి పనులు నిర్వహించేందుకు ఏ మాత్రమూ సామర్ధ్యం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రుజువు చేసుకుంది. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్ధులకు పొలిట్‌బ్యూరో మద్దతునిస్తోంది. ప్రభుత్వం ఈ వ్యవహారంలో అత్యంత తలబిరుసుగా వ్యవహరించడాన్ని ఖండించింది. విద్యార్ధుల డిమాండ్లకు తలొగ్గి, పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాలని డిమాండ్ చేస్తోంది.
అవినీతి నిర్మూలన డొల్ల
అవినీతిని సమూలంగా నిర్మూలిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ గొప్పగా చేసుకునే ప్రకటనలు, ప్రచారాలు కేవలం డొల్ల అని మరోసారి రుజువైంది. అత్యంత దారుణంగా అవినీతికి పాల్పడే వారి ఆశ్రిత పక్షపాతులకు ఎలాంటి హద్దూ అదుపూ లేనట్టు కనిపిస్తోంది. బాబ్రీ మసీదును కూలగొట్టి అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ఇప్పడు అతిపెద్ద అవినీతి కుంభకోణంలో చిక్కుకుంది. సంఘ్‌పరివార్ నేతృత్వంలోని రామాలయ ఉద్యమంలో అగ్ర భాగాన పాల్గొన్న అనేక మంది పేర్లు ఇప్పడు ఆలయ విరాళాల దుర్వినియోగంలో నిందితులుగా వినిపిస్తున్నాయి. ఈ చర్యలన్నీ సంఘ పరివార్ అసలైన స్వభావాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని మీడియా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలి. దోషులుగా తేలినవారిని వారెలాంటి పదవుల్లో వున్నా కఠినంగా శిక్షించాలి. ‘నేను లంచం తీసుకోను, ఎవరూ తీసుకోవడానికి అనుమతించను’అంటూ పదే పదే చెప్పకునే ప్రధాని ఈ అంశాలపై మౌనం వీడాలి. తన మంత్రిమండలిలోని అవినీతి, అసమర్ధ సహచరులపై నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి.
అమెరికా-ఇరాన్ ఎంఓయూ
అమెరికా, ఇరాన్ మధ్య సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఎంత బలహీనంగా ఉందో బహిర్గతమైంది. అవగాహనా ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజా ఒత్తిడిని కొనసాగించడం ద్వారా మాత్రమే కాల్పుల విరమణను పరిరక్షించగలం. అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే, ఇంధన మార్కెట్లలో చమురు ధరలు తగ్గాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం తక్షణమే ఈ ధరలను తగ్గించాలి. అలాగే ఎరువులను ముఖ్యంగా యూరియాను మన రైతాంగానికి అందుబాటులో ఉండేలా చూడాలి.
ఎన్నికల సంస్కరణల కోసం ప్రచారం
స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా నిష్పాక్షిక రాజ్యాంగ సంస్థగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) పూర్తి స్థాయిలో రాజీపడింది. వివిధ రాష్ట్రాల్లో సర్ ప్రక్రియలో దాదాపు 6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారు. గుణపాఠాలు నేర్చుకుని, ఓటర్ల హక్కులు పరిరక్షించడానికి బదులుగా ఎన్నికల కమిషన్, నిబంధనల ఉల్లంఘనల గురించి పట్టించుకోకుండా చాలా రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ముందుకు సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మొత్తం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ విస్తృత స్థాయిలో, సమగ్రంగా ప్రచారం చేపట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
11 నుంచి కేంద్ర కమిటీ సమావేశం
ఈ నెల 11 నుంచి13 తేదీల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుంది.



