Wednesday, July 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశీర్వాద సభల పేరిట నాటకాలా?

ఆశీర్వాద సభల పేరిట నాటకాలా?

- Advertisement -

‌రైతన్నలకు రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం :సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి రైతన్నలకు ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ద్రోహిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యూరియా కొరత రైతన్నల కష్టాల నుంచి దృష్టిమళ్లించడం కోసమే ఇప్పుడు ఆశీర్వాద సభల పేరుతో ముఖ్యమంత్రి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఒక్క కంప్యూటర్ బటన్ నొక్కితే సరిపోయే రైతు భరోసా నామమాత్రపు నిధుల విడుదలకు ఆర్భాటంగా కేవలం ప్రచారమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్లు చేస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొన్నటిదాకా పంట కొనుగోళ్ల సంక్షోభం ఇప్పుడు యూరియా కష్టాలు మరోవైపు కమ్ముకు వస్తున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతన్నలు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని తెలిపారు. ఎగవేతల రేవంత్ రెడ్డి ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న తీరును చూసి రాష్ట్ర రైతన్నలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 30 నెలల పాలన ‘ముదనష్టపు పాలన’అని కేటీఆర్‌ ‌విమర్శించారు. వ్యవసాయాన్ని దండగలా మార్చి రైతుల గొంతు కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న గ్యారెంటీలతో గారడీ చేసి అధికారంలోకి వచ్చాక ఒకటి, రెండు ఎకరాలకే అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని తెలిపారు. దాదాపు 70 లక్షల మంది రైతుల ఉసురు పోసుకుంటున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రైతన్నలకు చేస్తున్న ద్రోహాన్ని రైతులు మర్చిపోతారనుకోవడం అవివేకమేనని హెచ్చరించారు. రూ. 50 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన రూ.రెండు లక్షల రుణమాఫీని కనీసం పావలా వంతు కూడా చేయకుండా అన్నదాతలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి 72 సార్లు చేసిన ఢిల్లీ టూర్లకు, పనికిరాని సభలకు పెడుతున్న రూ.కోట్లాది ఖర్చును ఆదా చేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేదని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా దొరక్క అల్లాడుతున్నారని కేటీఆర్‌ ‌తెలిపారు. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నదని తెలిపారు. పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకోవడం వారి చేతకానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగలా సాగిందని గుర్తుచేశారు. కేసీఆర్ టంచన్‌గా 11 సార్లు, సుమారు రూ.73 వేల కో‌ట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఎప్పటికీ ‘రైతు బాంధవుడి’గా నిలిచిపోతారని తెలిపారు. కానీ రైతులకు వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డి మాత్రం ‘రైతు ద్రోహి’గానే మిగిలిపోతారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -