– రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ : బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పేదలు, దళితులు, ఎస్‌టీ, బీసీలకు హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని.. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ముక్కలుగా చేసి, విసిరికొడుతుందని అన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు, బీసీలకు రాజ్యాంగం మహాత్మాగాంధీ ఉపాధి పథకం, భూ హక్కులు, రిజర్వేషన్లు సహా పలు హక్కులను కల్పించిందని అన్నారు. మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని విసిరికొట్టాలనే నిర్ణయానికి వచ్చిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం కానప్పుడు .. ప్రభుత్వ సంస్థలను, రైల్వేలు, ఇతర సంస్థలను ఎందుకు ప్రయివేట్‌పరం చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోడీ కేవలం 22 నుంచి 25 మంది పారిశ్రామిక వేత్తలను బిలియనీర్లుగా మారిస్తే .. కాంగ్రెస్ కోట్లాది మంది మహిళలను లక్షాధికారులను చేస్తుందని అన్నారు. భింద్ లోక్‌సభ (ఎస్‌సీ-రిజర్వ్‌డ్) స్థానం నుండి బీజేపీ సిట్టింగ్ ఎంపీ సంధ్యా రారుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్యను పోటీకి దింపింది.