మీ గుర్తుగా మా గుండెల‌ల్లో నెత్తుటి స్థూపాలు క‌డ‌తాం

As a sign of you, we wash bloody stupas in our heartsపోరాడే వారికి ఉరికొయ్యలు కొత్తకాదు. మేడే వీరులను ఉరితీసిన కొయ్యలే భగత్‌సింగ్‌నూ ఉరితీశాయి. వాటి సూక్ష్మ రూపం ఒక్కటే. ఆ వ్యవస్థనే రద్దుచేసి ఆ మృతవీరుల ఆశయాలకు కొత్త ఊపిరి పోస్తుంది రేపటి ఉదయం.
చికాగో అమరులకు ఈ మేడే సందర్భంగా ఇంతకు మించిన నీరాజన మేముంటుంది? ఓ యువ కవి రాసిన పై గీత చరణం వయసు తక్కువే. కాని దానిలో దాదాపు ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర ప్రతిధ్వనిస్తోంది. పెట్టుబడి పొట్టన పెట్టుకున్న ఆ వీరులను ఇన్నేండ్లుగా ప్రపంచ కార్మికోద్యమం కంటిపాపలకన్నా భద్రంగా చూసుకుంటున్నది. ఉరితీయబడ్డ ఆ శిరస్సులు అస్తమించిన రోజు నుండే ప్రశ్నలెన్నో ఉదయిస్తూనే ఉన్నాయి. దానికి ముందూ, ఆ తర్వాత కూడా ఎందరో కార్మిక నాయకుల్ని, సాధారణ కార్మికులను రాజ్యం మట్టుబెట్టింది. యంత్రాల విధ్వంసానికి పాల్పడ్డ లుడ్డైట్‌లను 1812, 1813లో కాల్చిచంపింది బ్రిటన్‌ ప్రభుత్వం. ఆ దేశ సిఆర్‌పీసీనే సవరించి యంత్రాన్ని ధ్వంసం చేసినా ఉరిశిక్షలు ఖాయం చేసింది. 1971లో పారిస్‌ కమ్యూన్‌ను అణిచివేసేందుకు విమానాల ద్వారా బాంబులు కురిపించింది ఫ్రెంచ్‌ ప్రభుత్వం. ఇవి 1886కు ముందు ఘటనలు. 1940ల్లో నాజీ నరహంతకులను ఎదిరించేందుకు సోవియట్‌ పౌరులు రెండు కోట్ల మంది ఆహుతయ్యారు. వారి రక్తతర్పణే లేకుంటే వలస వ్యవస్థ కూలిపోయేఉండేది కాదు. మన దేశంతో సహా ఎన్నో దేశాలు సామ్రాజ్యవాద దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందేవేగావు. వేటికవే సాటిలేని త్యాగాలవి.
అయినా, మేడే అమరులెందుకు చిరస్మరణీ యులుగా నిలిచారు? ఎందుకంటే, వారు సవాలు చేసింది పెట్టుబడిదారీ వ్యవస్థను. ఆ వ్యవస్థకు ఇంధనం అదనపు విలువ. ఆనాడు అదనపు విలువ పిండుకోవడానికి అధిక పనిగంటలు ప్రధాన సాధనం. అందుకే దాన్ని రక్తపుటేరుల్లో ముంచెత్తారు ఆనాటి అమెరికన్‌ పాలకులు. పెట్టుబడిదారులు తమ దోపిడీ పద్ధతులను ఎప్పటికప్పుడు పదును చేసుకున్నట్లే, కార్మికవర్గమూ రాటుదేలాలి కదా! ప్యారిస్‌ కమ్యూన్‌ వైఫల్యం తర్వాత కార్మిక, కర్షక ఐక్యత కీలకంగా ముందుకొచ్చింది. కార్మికవర్గం తనను తాను విముక్తి చేసుకోవాలంటే ఇతర కష్టజీవుల్నీ విముక్తి చేయాలి. ”మధ్యయుగాల్లో మున్సిపాలిటీలను, కమ్యూన్‌లను ఉపయోగించుకుని ఫ్యూడల్‌ ప్రభువులపై విజయవంతంగా తిరగబడింది పెట్టుబడిదారీ వర్గం. అలానే ట్రేడ్‌ యూనియన్‌లను ఉపయోగించి పెట్టుబడిదార్లపై కార్మికోద్యమం దాడి చేయాల”ని మార్క్స్‌ ఆశించాడు. మన ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం ఏ స్థాయిలో ఉందో నేడు మనం సమీక్ష చేసుకోవడం మేడేకు శోభనిస్తుంది.
తెలుగు రాష్ట్రాలకు మే 13 కీలకం. విశ్వ గురువు వేషధారణో, జి-20 పటాటోపమో, 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న ప్రచారమో విని, చూసి ఆ ఒక్క రోజూ ఏమరుపాటుకు లోనైతే దేశ ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ల వశమవడమేకాదు, భారత రాజ్యాంగమే మనువు పాలబడ్తుంది. ప్రభుత్వరంగ పరిశ్రమలు, ప్రభుత్వ సేవలు కలికానికి కూడా కనపడకుండా పోతాయి.
ఇటీవల ప్రచురితమైన సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి సర్వే ఈ ఎన్నికల్లో ఆర్థికాంశాలే కీలకం కానున్నాయని తేల్చింది. పరిమితమైన ఉపాధి అవకాశాలు, ఆకాశాన్నంటుతున్న ధరలు, పెచ్చరిల్లిన అవినీతి, పెరిగిన గ్రామీణ దారిద్య్రం, దిగజారుతున్న గృహ వినియోగం కీలకంగా మారనున్నాయని ఆ సర్వే తేల్చింది.
మరోసారి ఎన్నికల సమరాంగణాన మేడే వచ్చింది. కేంద్ర పాలకుల పుణ్యాన సాధించుకున్న హక్కులు, పెట్టుబడి కోసం వథ్య శిలపై ఎక్కించబడ్డాయి. ఇప్పటికే ఎన్నో బలయ్యాయి కూడా. సాంకేతికంగా రేపు ”మోడీ 3.0” పాలన వస్తుందా లేదా అనేదానికంటే కార్పొరేట్‌ స్వామ్యాన్ని అంతమొందించే దిశగా కార్మికోద్యమం సాగాలి. పోరాడేవారికి ఉరికొయ్యలు కొత్తకాదు. మేడే వీరులను ఉరితీసిన కొయ్యలే భగత్‌సింగ్‌నూ ఉరితీశాయి. వాటి సూక్ష్మ రూపం ఒక్కటే. ఆ వ్యవస్థనే రద్దుచేసి ఆ మృతవీరుల ఆశయాలకు కొత్త ఊపిరి పోస్తుంది రేపటి ఉదయం.

Spread the love