– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట
రాష్ట్రంలో వచ్చేనెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపిని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీలను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ(ఏం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి కోరారు. మండలంలోని సిరిపురం గ్రామంలో గురువారం నిర్వహించిన సిపిఐ(ఎం) పార్టీ గ్రామ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అనేక హామీలిచ్చి ఆ హామిలను నెరవేర్చకుండా కొత్త హామీలు ఇస్తూ ప్రజలను మోసగిస్తున్న బీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. కెసిఆర్ తన పాలనపై తనకు తానే గొప్పలు చెప్పుకోవడం తప్ప, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు ఊరికో కోడి.. ఇంటికో ఈకలాగా ఉన్నాయన్నారు. ఉద్యోగాల నియామకాల్లో పూర్తిగా వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే పాలకులను గద్దె దించడానికె ఎన్నికలే సరైన ఆయుధమని ఓటు అనే ఆయుధంతో బిజేపి, బిఆర్‌ఎస్ నూ ఓడించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఐ(ఏం) పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు బల్గూరి అంజయ్య, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, ఎంపిటిసి బడుగు రమేష్, మాజీ సర్పంచ్ రాపోలు భాస్కర్, అంబటి సురేందర్ రెడ్డి, కూనూరు వెంకటేశం, దోమలపల్లి నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.