బీజేపీ ఎత్తుల కసరత్తులు, దేశానికి విపత్తులు

ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట చేసి బీజేపీ ఓటుబ్యాంకు అపారంగా పెంచారన్న ప్రచారం చూస్తున్నదే. అయితే పాలకపక్షం పాచికలు అంతటితో ఆగడంలేదు. మోడీ అసాధారణ మానవుడై నట్టు, అతీతశక్తులున్నట్టు ఇప్పుడు భజన మొదలైంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ ఆయన తన బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్నికల కసరత్తు చేశారట. తర్వాత కాస్త కునుకుతీసి వెంటనే బెంగాల్‌కు విమానంలో బయిలుదేరి వెళ్లారట. ఏదో దైవదత్తమైన శక్తి వుంటే తప్ప ఇలా చేయడం సాధ్యం కాదని బీజేపీ వంతదారుగా వుండే నటి కంగనారనౌత్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. వారు ఆయన బయలుదేరుతున్న దృశ్యంపై ఇలాటి వ్యాఖ్యతో ప్రభుత్వ వర్గాలు చేసిన పోస్టునే ఆమె పొందుపర్చారు.” ప్రధానిని ఏదో దివ్య లోక శక్తి నడిపిస్తుండకపోతే ఈ మానవాతీత సమర్థతకు పట్టుదలకు మరే కారణముంటుంది?’ అని ఆమె ఆశ్చ ర్యం వెలిబుచ్చారు. 73 ఏండ్ల ప్రధాని తెల్లవారుజామున 3.30వరకూ పనిచేసి బయిలుదేరాడని ఆమె పొందు పర్చిన పోస్టులో వుంది. కింద వీరభక్తులు కొందరు నిజంగానే ఆయనకు ఏదో దివ్యప్రేరణ వుందని వంత పాడితే మరికొందరు ఎన్నికల సమయంలో ఇలాంటివి తప్పవు మరీ దేవుణ్ని చేయొద్దని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 1977లో ఎమర్జెన్సీని ప్రజలు ఓడించిన తర్వాత ఏర్పడిన జనతా ప్రభుత్వ ప్రధాని మొరార్జీ దేశాయికి 82 ఏండ్లు. వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌లతో సహా కొందరు గత ప్రధానులు ఇంతకన్నా పెద్దవారే.వారి వారి పద్ధతులలో పనిచేశారు. ప్రచారక్‌ ప్రధాన మంత్రి(పిపిఎం) నరేంద్ర మోడీ వారికన్నా ఎక్కువగా సంచరించే పనుల్లో భాగం పంచుకునే మాట నిజమే గాని అది ఆయన అలవాటు. తన ఆరోగ్యాన్ని, దారుఢ్యాన్ని ప్రశంసించవచ్చునేమో గాని దైవదత్తమైన శక్తి ఆపాదించడం హాస్యాస్పదమే.అయితే అది వ్యూహాత్మకం గానే జరుగుతున్న పని. కాంగ్రెస్‌ బలహీనపడిన పరస్థితుల్లో మిగిలిన పార్టీలను కూడా బీజేపీ తన వైపు తిప్పుకోవడంతో ఒంటరిగా ఆధిక్యత సాధించిన మాట నిజమే.అయితే ఇదివరలో ఎవరూ రెండు సార్లు ప్రధాని కానట్టు అదేదో అద్భుతమైనట్టు అదేపనిగా చెప్పుకోవడం వాస్తవికత కాదు. మోడీని దేశానికి నేతగానే గాక విశ్వగురువంటూ ఆయన వల్లనే అంతర్జాతీయ సంక్షోభాలు ఆగిపోతున్నాయని,మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చూడగలిగారని పొగడటం వెగటు పుట్టిస్తుంది.మతాన్ని దేవుణ్ని వాడుకోవడం కాస్త తననే దైవాంశసంభూతుడుగా,తనే ఒక మత ప్రవక్తగా చేసే ప్రక్రియ రాబోతున్నట్టు కనిపిస్తుంది. ఆ భ్రమను కాపాడటానికి మోడీ నిరంతరం తపిస్తూనే వుంటారు. ఈ మధ్య సముద్రగర్భంలోని ద్వారకా శిథిలాల దగ్గర ప్రణామం చేయడానికి నీళ్లలో మునిగిరా వడం పెద్ద ప్రచారాంశమైంది. నిజానికి అక్కడ దూకడం తేలడం తప్పమిగిలింది కనిపించదు. ఆయనను పొగుడుకోవడం తప్పమరేమీ మిగలని పాలకకూటమి పరి స్థితిని ఇది ప్రతిబింబిస్తుంది.
నేతలపై గాలం,పార్టీలపై దాడి
నిజంగా బీజేపీకి మోడీకి అంత సత్తా వుంటే అహోరాత్రులు అన్ని కసరత్తులు చేయవలసిన అవసరమే వుండేది కాదు. ఉదాహరణకు ఇప్పుడు 100 నుంచి 150 మంది లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసినట్టు కథనాలు వస్తున్నాయి. ఇందుకోసం చాలా లోతైన సర్వేలు జరిపారట. తమాషా ఏమంటే తమ పార్టీనే గాక అవతలి పార్టీలలో బలమైన అభ్యర్థు లున్నా ముందే ప్రజాభిప్రాయం తెలుసుకుని వారిని తమవైపు తిప్పుకోవడం లాగో పాచికలు వేశారట. ఇందులోని రాజ కీయ అనైతికతను గురించి విడిగా చెప్పాల్సిన అవసరమేముంది? గెల వడం ముఖ్యం, ఎలా ఎవరితో ఏ పద్ధ తిలో అనేది అప్రస్తుతం. ఈ సూత్రం తోనే మోడీ అమిత్‌షా ద్వయం లెక్క లేనన్ని కుట్రలతో ప్రతిపక్ష శిబిరాన్ని చిందరవందర చేయడానికి ప్రయ త్నించింది. వ్యతిరేకించే మీడియాను మేధావులను రచయితలు కళాకారు లను ఉద్యమకారులను వేటాడుతు న్నది. న్యాయవ్యవస్థ కూడా ఒత్తిడికి గురవుత్నునట్టు అత్యున్నత న్యాయ మూర్తులే అనేకసార్లు ఆవేదన వెలిబు చ్చిన పరిస్థితి. ఇందుకోసం నిజాయితీ పరులైన న్యాయ మూర్తుల నియామకాలు తొక్కిపట్టడం, ఉద్యోగ విరమణ తర్వాత పదవుల ఎరలు పరిపాటిగా మారాయి.ఇలాంటి నేపథ్యంలో ఇక ప్రతిపక్షాలనూ ప్రజా ఉద్యమాలను సహించే ప్రసక్తిలేకుండా పోతున్నది. రైతాంగ ఆందోళ నను అణచివేయడానికి రాజధానిని బహిరంగ చెరసా లగా మార్చిన తీరే ఇందుకు తాజా నిదర్శనం.
నిజంగా అంతుందా?
ఇవన్నీ ఒక ఎత్తయితే రాబోయే ఎన్నికలలో ఎలాగైనా మూడోసారి గెలవాటని మోడీ బృందం చేస్తు న్న విన్యాసాలు, విపరీత పోకడలు అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధంగా వున్నాయి. మానసికంగా తమ మాటకు ఎదు రులేదనే భావన పెంచడం ఇందులో మొదటిది. రాబో యేది తామేనని నమ్మించడం రెండవది.గతంలో కాంగ్రెస్‌ 30 ఏండ్లు పాలించినట్టే ఇప్పుడు బీజేపీ వంతు వచ్చిందన్న వాతావరణం కలిగించడంలో పరమార్థం అదే.అయితే అప్పటికీ ఇప్పటికీ దేశ రాజకీయదృశ్యంలో బలాబలాలలో వచ్చినమార్పులను చూసిన వారెవరైనా ఇది కేవలం భ్రమేనని చెప్పగలరు. తన రాజకీయ మిత్రు లతో కలసి దేశంలో కేవలం 15 రాష్ట్రాలు అంటే ఇంచు మించు సగం మాత్రమే బీజేపీ పాలించగలుగుతున్నది. దక్షిణాన తూర్పున బాగా వెనకబడి వుంది. ఈ లోటు భర్తీ చేసుకోవడం కోసం మోడీ పడని పాట్లు లేవు. ఈ వారంలోనే ఆయన తమిళనాడు, కేరళలో పర్యటించారు. తెలంగాణకు రాబోతున్నారు. ఏపీకి సంబంధించి వర్చ్యు వల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవాలు చేశారు. కర్నాటకలో కాంగ్రెస్‌ సర్కారును ఇబ్బంది పెట్టడానికి ఇడి, సిబిఐ లను ప్రయోగిస్తున్నారు.తమిళనాడు కేరళ,ఏపీ, తెలంగా ణలలో ఇప్పటికీ కావలసినంతగా వాటిని దుర్విని యోగం చేశారు. అయితే మోడీ లేకుంటే ఈడీ అంటూ దాన్ని ఆయనకు పర్యాయపదంగా చేశారు.ఇంతటి అప్రజాస్వామిక పాలన ఈ తరహాలో గతంలో చూసింది లేదు. అయితే ఆయన కార్పొరేట్లకు వరాలవర్షం కురిపిస్తూ సంఘ పరివార్‌ ఎజెండాను తుచతప్పకుండా అమలు చేస్తారు గనక ఈ రెండు బలమైన వర్గాలు వత్తాసునిస్తున్నాయి. వారి చేతుల్లోని బడా మీడియా ఎప్పుడూ ఆయనను కీర్తించే పనిలో మునిగితేలుతున్నది. 2024 హ్యాట్రిక్‌ గీతావళి ఇందులో ఇప్పుడు ముందుకొచ్చి కూచుంది.
కసరత్తులో ఎత్తులు
గత నాలుగురోజులుగా వింటున్న ఎన్నికల కసర త్తుల గురించే చూద్దాం.తమిళనాడులో అన్నాడిఎంకెను, కర్నాటకలో జెడిఎస్‌ను దారికి తెచ్చుకున్న బీజేపీ కేరళలో మొహం తేలేయక తప్పలేదు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు అక్కడ శత్రువులు దేశంలో మిత్రులని మోడీ అక్కడ ఎద్దేవా చేసి వచ్చారు. తమలో తాము పోట్లాడినా మత తత్వ రాజకీయాలను అడ్డుకోవడమనే కేరళ విశిష్టత ఆయనకు నచ్చలేదు. ఇంత విలక్షణమైన రాజకీయ సం స్కృతి మరెక్కడా చూడం.దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌ ఈ వాస్తవాన్ని గుర్తించి బాధ్యతగా వ్యవహరించే బదులు సీపీఐ(ఎం), వామపక్షాలను దెబ్బతీయడమే కార్యక్ర మంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కూడా వెళ్లి ఎల్‌డిఎఫ్‌పై రాళ్లు విసిరి వచ్చారు. నిజానికి హిమచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్ని కల సందర్భంగా కాంగ్రెస్‌వారి క్రాస్‌ఓటింగ్‌తో గెలిచిన బీజేపీ ఆ సర్కారును కూల దోయడానికి సర్వసిద్ధంగా వుంది. అదే జరిగితే తర్వాతి లక్ష్యం తెలంగాణ అనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది.ఆ అవకాశం లేదని టి కాంగ్రెస్‌ నాయకులు గాంభీర్యం చూపిస్తున్నా ముప్పు వుండనే వుంటుంది. హిమచల్‌ గతే ఇక్కడా పడుతుం దని బీజేపీ ఎంపిలు కె,లక్ష్మణ్‌, అరవింద్‌, బండి సంజ రువంటివారు రోజూ బెదిరిస్తున్నారు. అసలు రేవంత్‌నే ఏక్‌నాథ్‌ షిండేలా అవుతారని అవహేళన చేస్తున్నారు. వీటిపై కాంగ్రెస్‌ నుంచి నిజానికి రావలసినంత స్పందన నిరసన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఎపిలోనైతే గత ప్రస్తుత పాలకపార్టీలైన టిడిపి (జనసేన సహితంగా) వైసీపీలు బీజేపీ పల్లకీ మోయడానికే పోటీలు పడుతున్నాయి. పోటాపోటీగా వారు జరిపే సభల్లో పరస్పర దూషణలు తప్పఎక్కడా బీజేపీపై, మోడీ పై పెదవి కదిపే ప్రసక్తి వుండదు. మోడీని మూడోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమని పవన్‌కళ్యాణ్‌ మొన్న తాడే పల్లి సభలోనూ ప్రకటించేశారు.దేశంలోనూ ప్రత్యేకించి దక్షిణాదిలోనూ మరెక్కడా ఈ విధంగా మూడు పాలకపార్టీలూ బీజేపీని మోసే పరిస్థితి చూడలేం! విచిత్రమేమంటే టీడీపీ, జనసేన ఇంతగా లోబడిపోతున్నా తన రాజకీయ మాయాజాలం తేలని బీజేపీ పొత్తులపై స్పష్టత ఇవ్వకుండా వారిని తిప్పుకుంటున్నది. ఇది రాసే సమయానికి బీజేపీ ఒంటరిగా వెళుతుందని సంకేతాలు వస్తున్నా పొత్తు అవకాశాన్ని తోసిపుచ్చ లేము. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్‌ వామ పక్షాలు ఇతర పార్టీలు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రయోజనాలు లౌకికతత్వం వంటివాటిపై ప్రత్యేకంగా కార్యక్రమాలు జరపడం చూ స్తున్నాం, దేశంలో ఇతరచోట్ల కూడా వామ పక్షాలు గానీ, ఇండియాలో భాగస్వాములు గా వున్న సమాజ్‌వాది, ఆప్‌, ఆర్జేడీ వంటిపార్టీలు గానీ చేతులు కలిపి నడిచేందుకే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి ప్రతిపక్షాలలో పెద్దదైన కాంగ్రెస్‌ పార్టీయే హిమచల్‌ పరిణామాల తర్వాత సర్కారును కాపాడుకో లేక సతమతమవుతున్నది. మొన్న ఓడిపోయిన మధ్య ప్రదేశ్‌లోనూ కమల్‌నాథ్‌ వంటినాయకులే కమలం పంచన చేరే సూచనలు వదులుతున్నారు.లౌకిక పార్టీ లపై వామపక్షాలపై బీజేపీ దాడి పెరుగుతున్న సమ యంలో కాంగ్రెస్‌ అంతర్గత బలహీనతలు అనైక్యత నుంచి బయటపడ లేకపోవడం పెద్ద సవాలే. కాంగ్రెస్‌ లొసుగులు ఆసరా చేసుకుని మోడీ తన దాడినంతటికీ ఆ పార్టీని ముందుపెట్టి ప్రతిపక్ష శిబిరంపై దాడి చేయ డం వాస్తవం. ఆ దాడిని ఏకోన్ముఖంగా ఎదుర్కొగల చేవ కూడా కాంగ్రెస్‌ ప్రదర్శించలేకపోతున్నది. హిమ చల్‌లో సంక్షోభంతో పాటు యూపీలో ఒక రాజ్యసభ సీటు కోల్పోవడం కూడా కాంగ్రెస్‌, ఎస్‌పిల నిరుత్సా హానికి కారణమైంది. రారుబరేలీలో సోనియా తప్పుకో వడం, ప్రియాంక అక్కడకు వస్తారా లేదా రాహుల్‌ అమేథీలో పోటీ చేస్తారా వంటివే పెద్ద ప్రశ్నార్థకాలై కూ చున్నాయి. కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలలో లోపాలు, అవకాశవాదాలు కొన్ని ఆటంకాలుగా వున్నా మొత్తానికి బీజేపీని నిలవరించే అవకాశాలు చాలా వున్నాయనేది వాస్తవమే. బీజేపీకి సొంతంగా 370 స్థానాలు వచ్చే అవకాశమే లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నొక్కిచెప్పడం గమనించదగిన విషయం.

– తెలకపల్లి రవి

Spread the love