కొన్ని సందర్భాల్లో రోగుల అంతర్గత అవయవాలు చిట్లిపోయి రక్తస్రావం జరుగుతుంది. అది పరిస్థితి తీవ్రతకు చిహ్నం. అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా ప్రారంభించిన సుంకాల దాడితో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికాకు అలాంటి ముప్పే పొంచి ఉందని జెపి మోర్గాన్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త బ్రూస్ కాస్‌మాన్ హెచ్చరించాడు. దేర్ విల్ బి బ్లడ్ (రక్తస్రావం జరగొచ్చు) అనే శీర్షికతో తమ ఖాతాదార్లకు వెల్లడించిన విశ్లేషణ ప్రపంచ వార్తగా నిలిచింది. ట్రంప్ దెబ్బకు ఎస్ అండ్ పి 500 సూచికలో కంపెనీల వాటాల ధరలు ఒక్క రోజే 2.4లక్షల కోట్ల డాలర్ల మేర పతనమయ్యాయి. ప్రపంచం మాంద్యంలోకి దిగజారే ముప్పు 40 నుంచి 60శాతానికి పెరిగినట్లు జెపి మోర్గాన్ హెచ్చరించింది. ఏప్రిల్ రెండవ తేదీని అమెరికా విముక్తి దినంగా ట్రంప్ చెబితే అది ప్రపంచానికి దుర్దినంగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా అమెరికా గృహస్తులు పెద్ద మొత్తంలో కాఫీ దగ్గర నుంచి కార్ల వరకు భారాలు మోయనున్నారని కాస్‌మాన్ చెప్పాడు. అమెరికా విధానాలలో ఎలాంటి మార్పులు లేకపోతే మాంద్యం ఈ ఏడాది ప్రపంచవ్యాపితం కావచ్చన్నాడు. చర్యకు ప్రతి చర్య ప్రకృతి ధర్మం. ట్రంప్ బాణాల దెబ్బలు తిన్నవారు ప్రతి శస్త్రాలను సంధించకమానరు. వాటి పర్యవసానాలు అమెరికా, కేవలం పెంగ్విన్ పక్షులు మాత్రమే ఉండే అంటార్కిటా ప్రాంతంతో సహా యావత్ ప్రపంచం మీద ఉంటాయని విశ్లేషణలు వెలువడ్డాయి. మనతో సహా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.
దిగిన తర్వాత గానీ చెరువు లోతు తెలియదు, ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా పన్నుల పెంపుదల ప్రకటన చేయగానే అంతా అయిపోయినట్లు భావించనవసరం లేదు. కెనడా మీద విధించిన భారాలను అంగీకరించేది లేదని నలుగురు అధికారపక్ష సెనెటర్లతో సహా ప్రతిపక్షం పెట్టిన తీర్మానాన్ని అమెరికా సెనెట్ ఆమోదించింది. తనకున్న అధికారాలతో దాన్ని తోసిరాజనవచ్చు. కానీ ట్రంప్‌కు సెగ తగిలిన కారణంగానే పన్నుల గురించి చర్చించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేయక తప్పలేదు. అయితే ఆయన సలహదారులు మాత్రం అబ్బే అలాంటిదేం, ప్రకటించిన పన్ను మొత్తాలు బేరసారాలాడేందుకు కాదని వెంటనే వివరణ ఇచ్చారు.తొత్తు ఇజ్రాయిల్‌తో సహా వంద దేశాల మీద తొడగొట్టిన ట్రంప్ అమెరికాను ఒక విధంగా ఒంటరిపాటు చేశాడనే చెప్పాలి.బల వంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చినట్లు, గడ్డిపోచలతో మదగజాన్ని బంధించినట్లు యావత్ దేశాలు తలచుకొంటే ట్రంప్ దిగిరాక తప్పదు. అయితే పరస్పరం విధించుకొనే పన్నులు సామాన్యులను బికారులను చేస్తాయి తప్ప పాలకవర్గాల ప్రతినిధులుగా ఉన్న కార్పొరేట్లకు జరిగే నష్టమేమీ ఉండదు.ట్రంప్ విధించిన పన్నులతో ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వానికి 600 బిలియన్ డాలర్ల మేర అదనపు రాబడి వస్తుందని అంచనా. దాన్ని మరో విధంగా చెప్పాలంటే అంత మొత్తంలో నామమాత్రంగా దిగుమతిదారులు, అత్యధిక భాగం వినియోగదారులే భరిస్తారు. అప్పుడు అధికారంలో ఉన్నవారికి సెగ తగులుతుంది. అందుకే ఒక దశవరకు వచ్చిన తర్వాత ట్రంప్ వెనక్కు తగ్గవచ్చనే అభిప్రాయాలూ వెల్లడౌతున్నాయి, తెగేదాకా లాగితే ఆ పెద్దమనిషి పదవికే ఎసరు వస్తుంది.
కొత్త పన్నులతో అమెరికాలో ద్రవ్యోల్బణం 3 నుంచి 3.5శాతానికి పెరుగుతుందని అంచనా. జెపి మోర్గాన్, గోల్డ్‌మాన్ శాచస్, మూడీస్, తదితర సంస్థల విశ్లేషకులు ఎటు తిప్పి ఎటుచెప్పినా వాణిజ్య యుద్ధం ఒక విషవలయం వంటిది. ద్రవ్యోల్బణం పెరిగితే, ధరలు హెచ్చి వినియోగదారుల విశ్వాసం, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అది వృద్ధిరేటు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిరుద్యోగ పెరుగుదలకు దారితీస్తుంది. దశాబ్దాల తరబడి సాగుతున్న వాణిజ్య వివాదాలు ఒక కొలిక్కి రాలేదు. గత కొన్నేండ్లుగా ప్రపంచ ఆర్థిక మౌలిక అంశాలు బలహీనంగా ఉన్నాయి.గోరుచుట్టు మీద రోకటి పోటులా తగిలిన ట్రంప్ పన్నులు దేనికి దారితీస్తాయో తెలియని అయోమయానికి కారణం అవుతున్నాయి. ‘ప్రధాని మోడీ మంచి వాడే..భారతే చెడ్డది’ అన్న ట్రంప్‌ను ఆత్మగౌరవం గల భారతీయులెవరూ సహించకూడదు. అసహ్యకర (డర్టీ) పదిహేను దేశాలు అంటూ మీడియాలో వర్ణిస్తున్నా మౌనమే. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ట్రంప్ పన్నుల బాదుడు మనకు మేలు చేసేవా హానికరమా? అన్నది ఏదో ఒకటి చెప్పకుండా 140 కోట్ల జనాభాకు తాను జవాబుదారీ అని నరేంద్రమోడీ ఎలా చెప్పుకోగలరు?