రైతు బాంధవుడు బోడేపూడి

The relative of the farmer is Bodepudi A nickname for righteousness and honesty– నీతి, నిజాయితీకి మారుపేరు

– ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు దిగ్గజం

– మధిర ప్రజల ఆత్మీయ మిత్రుడు
– ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయం
– అలాంటి వారు చట్టసభల్లో ఉండాలనేది ప్రజల ఆకాంక్ష
నవతెలంగాణ – బోనకల్‌
రైతులు పండించిన పంటలకు సాగు నీరందించేందుకు అహర్నిశలూ కృషి చేసి తన జీవితాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితం చేసిన కమ్యూనిస్టు యోధులు బోడేపూడి వెంకటేశ్వరరావు. మరణించే వరకు ప్రజా సేవలోనే గడిపారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా సీపీఐ(ఎం) అభ్యర్థిగా బోడేపూడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ మధిర నియోజకవర్గ అభివృద్ధి బోడేపూడి నుంచే ప్రారంభమైంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయాల్లో బోడేపూడి ఎమ్మెల్యేగా, సీపీఐ(ఎం) శాసనసభాపక్ష నాయకులుగా వ్యవహరించారు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు. శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగిన సమయంలో ఆ రెండు పార్టీల నేతలు బోడేపూడి చెప్పిన సూచనలకు కట్టుబడి ఉండేవారు. ఆ విధంగా శాసనసభలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి సంధానకర్తగా కూడా వ్యవహరించి ప్రజా నాయకుడిగా పేరు సంపాదించారు. మధిర నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో ఎన్‌టీఆర్‌, చంద్రబాబు వెంటనే స్పందించేవారు. బోడేపూడి వెంకటేశ్వరరావు ప్రస్తావించిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించేవారు. శాసనసభలో తన వాగ్దాటితో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడమే కాదు. వాటికి పరిష్కారాలనూ సాధించేవారు.
రైతు బాంధవుడు బోడెపూడి
ఆనాడు ప్రభుత్వం రెండు మంచినీటి పైలెట్‌ ప్రాజెక్టులను మంజూరు చేయగా.. అందులో మధిర నియోజకవర్గం ఉండటం విశేషం. మధిర నియోజకవర్గ ప్రజలు మంచినీటి సమస్యతో ప్రధానంగా ఫ్లోరైడ్‌ నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శాసనసభలో బోడేపూడి ప్రస్తావించారు. ఫ్లోరైడ్‌ నీటిని తాగటం వల్ల కాళ్లు వాపులు వస్తున్నాయని స్వయంగా తన కాళ్లను శాసనసభలో చూపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మధిర నియోజకవర్గానికి మంచినీటి పైలెట్‌ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఆ వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభించింది.
మధిర నియోజకవర్గంలో ఆనాడు ఎర్రుపాలెం, మధిర, బోనకల్‌, వైరా, తల్లాడ మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు ప్రధాన కేంద్రంగా వైరా ఉండటంతో వైరా చెరువులో పైలెట్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి మధిర నియోజకవర్గంలోని 104 గ్రామాలకు మంచినీటి సరఫరా చేశారు.
బోడేపూడి మరణాంతరం మంచినీటి పైలెట్‌ ప్రాజెక్టుకు బోడేపూడి సుజల స్రవంతి పథకంగా నామకరణం చేశారు. నియోజకవర్గంలో సాగు నీటి సమస్య ఏర్పడినప్పుడు మధిర నియోజకవర్గ రైతులు అధికారులకు కాకుండా బోడేపూడికే ఫోన్‌ చేసేవారు. ఇంటికి వెళ్లి తమ గోడును వివరించేవారు. రైతుల సమస్యలు విన్న వెంటనే ఆయన కాలువల మీద పర్యటించేవారు.
వయసు మీద పడినా లెక్కచేయకుండా రైతుల కోసం రాత్రి, పగలు తేడా లేకుండా కృషి చేసి నీటిని విడుదల చేయించడంలో, పంటలను కాపాడటంలో బోడేపూడి నిర్విరామంగా కృషి చేశారు. ఆయన ఎక్కువగా రైతులతోనే గడిపారు. నిత్యం కాలువలు బాగున్నాయా లేదా అని చూసి మరమ్మతులు చేయించేవారు. అందుకే ప్రజలు బోడేపూడికి రైతు బాంధవుడుగా నామకరణం చేశారు. అంతర్గత రోడ్లు, రోడ్ల ఫార్మేషన్‌, సాగు, తాగునీటి సమస్య పరిష్కారంలో ప్రధాన భూమిక వహించారు.
ప్రజలకు, పార్టీకి నిబద్ధుడు
సీపీఐ(ఎం) నిబంధనలకు కట్టుబడి తూ.చా తప్పకుండా పాటించేవారు. ఏ సమస్య వచ్చినా పార్టీ నిబంధనలకు లోబడే పని చేసేవారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా దానిని ప్రజల కోసమే ఉపయోగించారు. ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితాన్ని గడేపేవారు. మధిర నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. సాగర్‌ నీరు అనగానే రైతులందరికీ గుర్తుకు వచ్చేది నేటికీ బోడేపూడి వెంకటేశ్వరరావే కావడం విశేషం. నీటి సమస్య రాగానే బోడేపూడి లేకపోవడం వల్లే మనకి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని, అదే ఆయన ఉంటే ఈ సమస్య ఉండేది కాదని రైతులు స్మరించుకుంటున్నారంటే ఆయన రైతులకు ఏ విధంగా సేవలు చేశారో అర్థం అవుతుంది. అటువంటి నాయకుడు చట్టసభల్లో ఉండాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు. జనం గుండెల్లో ఆయన చిరంజీవి.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా..
మధిర నియోజకవర్గంలో ఆనాడు అనేక గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేదు. కరెంటు సమస్య తీవ్రంగా ఉండేది. ఆయన ఎమ్మెల్యే కాగానే ప్రధానంగా రోడ్లు, కరెంటు సమస్య, సాగునీటి, తాగునీటి సమస్య పరిష్కారం చేసి నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మధిర నియోజకవర్గంలో బోనకల్‌ మండలం ముష్టికుంట గ్రామంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బోడేపూడి మరణించిన సమయంలోనూ చంద్రబాబు దగ్గర ఉండి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
సంవత్సరం ఎమ్మెల్యే..
1952 ఇద్దరు.. కె.వి దొర, కృష్ణారావు (కె ఎంపీపీ పార్టీ)
1955 ఇద్దరు.. ఎండి తాసిల్‌, ఎస్‌ సీతారామయ్య (సీపీఐ)
1957 ఉప ఎన్నిక.పివి రావు (కాంగ్రెస్‌)
1962 మహమ్మద్‌ తాసిల్‌ (సీపీఐ)
1967 కన్నయ్య దొర (కాంగ్రెస్‌)
1972 మట్ట రామచంద్రయ్య (కాంగ్రెస్‌)
1978 ముర్ల ఎర్రయ్య రెడ్డి (సీపీఐ(ఎం))
1983 ముర్ల ఎర్రయ్య రెడ్డి (సీపీఐ(ఎం))
1985 కుంజా బొజ్జి (సీపీఐ(ఎం))
1989 కుంజా బొజ్జి (సీపీఐ(ఎం))
1994 కుంజా బొజ్జి (సీపీఐ(ఎం))
1999 సున్నం రాజయ్య (సీపీఐ(ఎం)
2004 సున్నం రాజయ్య (సీపీఐ(ఎం)
2009 కుంజా సత్యవతి (కాంగ్రెస్‌)
2014 సున్నం రాజయ్య (సీపీఐ(ఎం)
2018 పోదెం వీరయ్య (కాంగ్రెస్‌)

Spread the love