రామేశ్వరం కేఫ్‌లో పేలింది బాంబే..సీఎం సిద్ధరామయ్య

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో చోటుచేసుకున్న పేలుడులో తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. అది బాంబు పేలుడేనని (ఐఈడీ) స్పష్టం చేశారు. ఓ వ్యక్తి కేఫ్‌లోకి వచ్చి ఓ బ్యాగు పెట్టి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందన్నారు. బ్యాగులో ఉన్న వస్తువు పేలడంతోనే ఆ ఘటన జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ.. ఫోరెన్సిక్‌ బృందం నివేదిక కోసం వేచి చూస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ‘రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించినట్లు మధ్యాహ్నం 12.30కి సమాచారం వచ్చింది. అక్కడో బ్యాగు కూడా ఉంది. అది పేలుడు పదార్థం (ఐఈడీ) అని తెలిసింది. తక్కువ తీవ్రత కలిగిందని తెలుస్తోంది. కేఫ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగును అక్కడ పెట్టి కౌంటర్‌లో టోకెన్‌ తీసుకున్నాడు. పోలీసులు క్యాషియర్‌ను ప్రశ్నిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారన్నారు. ఈ ఘటనలో హోటల్‌ సిబ్బందితోసహా మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయని చెప్పారు. ఐఈడీ కారణంగానే ఆ పేలుడు సంభవించిందా అన్న విషయాన్ని నిర్ధరించేందుకు నమూనాలు సేకరిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. గ్యాస్‌ లీక్‌ కారణంగా పేలుడు జరిగిందని వచ్చిన అనుమానాలను తోసిపుచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. ఓ మహిళ హ్యాండ్‌బ్యాగ్‌ అక్కడ లభించిందన్నారు.

Spread the love