బాండ్ల కిరికిరి

Bonds are dirty– వివరాలు వెల్లడి
– అసలు విషయం రహస్యమే
– సుప్రీం తీర్పు స్ఫూర్తి బేఖాతరు
– మళ్లీ తప్పని న్యాయపోరాటం
న్యూఢిల్లీ : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఎన్నికల కమిషన్‌ కలిసి సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని తుంగలో తొక్కాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు ఒకవైపు కనిపిస్తూనే, మరోవైపు అసలు విషయాన్ని దాచేశాయి. దీంతో కొంతకాలంగా చర్చనీయాంశం గా ఉన్న ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం మరింత గందరగోళంగా మారింది. ఏ కంపెనీ నుండి ఏ పార్టీకి ఎంత నిధులు ముట్టాయన్న అంశాన్ని మినహా మిగిలిన వివరాలను ఎన్నికల కమిషన్‌ గురువారం రాత్రి బహిర్గతం చేసింది. తన వెబ్‌సైట్‌లో ఈ వివరాలను అప్‌లోడ్‌ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అత్యంత పారదర్శకంగా అమలు చేసినట్లు ప్రకటించింది. మొత్తం 763 పేజీలతో రెండు భాగాలుగా ఇసి వెబ్‌సైట్‌లో ఉంచిన ఈ నివేదికలో యే తేదిన కొనుగోలు చేశారన్న వివరాలను పార్ట్‌ 1లోనూ, బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు, ఎంత మొత్తం, తేదీలను పార్ట్‌-2లోనూ ఇసిఐ ప్రకటించింది. ఏ సంస్థ ఎంత మొత్తానికి బాండ్లను కొనుగోలు చేసిందన్న విషయాన్ని, ఏ పార్టీకి ఎంత మొత్తంలో నిధులు అందాయన్న విషయాన్ని వీటి ఆధారంగా తెలుసుకునే వీలుంది. కానీ, ఏ సంస్థ, ఏ పార్టీకి ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చిందన్న విషయాన్ని తేల్చడం అసాధ్యం. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆచరణలో వమ్ము చేసినట్టుయైంది. కీలకమైన ఆ విషయాన్ని ఎస్‌బిఐ దాచి పెట్టిందా, ఎస్‌బిఐ నుండి వివరాలు అందినా ఎన్నికల కమిషన్‌ ప్రకటించలేదా అన్న విషయాలు తెలియలేదు. ప్రభుత్వం నుండి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చిన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో మరోసారి న్యాయపోరాటం తప్పనిస్థితి నెలకొంది. ఎలక్టోరల్‌ బాండ్ల కేసులో పిటిషనర్ల తరపు వాదించిన న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ ఈ విషయం తెలిపారు. ఎలక్టోరల్‌ బాండ్లపై ఎస్‌బిఐ ముద్రించిన ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌ను వెబ్‌సైట్‌లో వెల్లడి చేయలేదని ఆయన తెలిపారు. ఆ కోడ్‌ ఉంటే బాండ్లను కొన్న సంస్థల వివరాలను, రాజకీయ పార్టీలు మార్చిన బాండ్లతో పోల్చి, ఎవరు ఎవరికి ఇచ్చారన్న విషయాలను తెలుసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆ కోడ్‌ను వెల్లడిచేయాలని కోరుతూ మరోసారి పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తొలుత ఇచ్చిన తీర్పులోనే దీనిని కూడా వెల్లడి చేయాలన్న అంశం అంతర్లీనంగా ఉందని ఆయన అన్నారు. ఎడిఆర్‌ సహ వ్యవస్థాపకుడు జగదీప్‌ చోకర్‌ ‘ప్రస్తుతం అందిన సమాచారంతో ఏం చేయగలమన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని చెప్పారు.
సంస్థ పేరు                                               రూ.కోట్లలో
1.ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్స్‌                        1,368
2. మేఘా ఇంజినీరింగ్‌                                      966
3. క్విక్‌ సప్లై చైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌                          410
4. వేదాంత లిమిటెడ్‌                                        400
5. హాల్డియా ఎనర్జీ లిమిటెడ్‌                                377
6. భారతి గ్రూప్‌                                              247
7. ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండిస్టీస్‌                         224
8. వెస్టర్న్‌ యుపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌                       220
9. కెవెంటర్‌ ఫుడ్‌పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌                  194
10. మదన్‌లాల్‌ లిమిటెడ్‌                                  185
11. డిఎల్‌ఎఫ్‌ గ్రూప్‌                                      170
12. యశోదా హాస్పిటల్‌                                    162
13. ఉత్కల్‌ అలుమినా ఇంటర్నేషనల్‌                   145
14. జిందాల్‌ స్టీల్‌ పవర్‌ లిమిటెడ్‌                       123
15. బిర్లా కార్బన్‌ ఇండియా                            105
16. రుంగ్టా సన్స్‌                                         100
17. డాక్టర్‌ రెడ్డీస్‌                                          80
18. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌                      60
19. నవయుగ ఇంజినీరింగ్‌                              55
20. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌                                40
21. ఎడెల్‌వైజ్‌ గ్రూప్‌                                     40
22. సిప్లా లిమిటెడ్‌                                       39
23. లక్ష్మి నివాస్‌ మిట్టల్‌                                35
24. గ్రాసిమ్‌ ఇండిస్టీస్‌                                   33
25. జిందాల్‌ స్టైన్‌లెస్‌                                   30
26. బజాజ్‌ ఆటో                                       25
27. సన్‌ పార్మా లేబొరేటరీస్‌                           25
28. మన్‌కిండ్‌ పార్మా                                   24
29. బజాజ్‌ ఫైనాన్స్‌                                     20
30. మారుతి సుజుకీ ఇండియా                        20
31. అల్ట్రాటెక్‌                                            15
32. టివిఎస్‌ మోటర్స్‌                                    10

Spread the love