అటు విజ‌యం.. ఇటు ప‌రాజ‌యం..

That's victory.. that's defeat..– సొంతూరున్న స్థానంలో విజయం
– సీఎం పరువు కాపాడిన భువనగిరి,నాగర్‌కర్నూల్‌
– మల్కాజిగిరి, చేవెళ్లలో భారీ ఓటమి మూటగట్టుకున్న హస్తం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని విజయతీరాలకు చేర్చిన రేవంత్‌కు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొంత ఇబ్బందికరంగా పరిణమించాయి. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించిన మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఆ నాలుగింటిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు రెండింటిలో ఓడిపోయి, మరో రెెండు చోట్ల విజయసాధించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఓటున్న మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో హస్తం పార్టీ ఓటమి పాలైంది. అదే విధంగా ఆయన సొంతూరున్న నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో మాత్రం ఘనవిజయం సాధించింది. మొన్నటిదాకా ఆయన మల్కాజిగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వచ్చారు. కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాక… ఆ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అయితే రేవంత్‌ ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నది. ఆ ఓటమికి కారణాలేమైనా…పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎంపిక చేయడాన్ని మొదట్లోనే చాలా మంది వ్యతిరేకించారు. ఆమెకు సొంత నియోజకవర్గమైన చేవెళ్లను కేటాయించకుండా పక్క నియోజకవర్గమైన మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని కేటాయించడం పట్ల అనేక విమర్శలొచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ధీటైన నేతను బరిలో దింపకుండా రేవంత్‌రెడ్డి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారనే విమర్శలున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గాన్ని దక్కించుకోలేకపోయారనే చర్చ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. దీంతోపాటు రేవంత్‌ ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ పరిధిలో ఉంది. అక్కడ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి 50వేల మోజార్టీ ఇవ్వాలంటూ రేవంత్‌రెడ్డి అనేక సభల్లో అభ్యర్థించారు. ఎక్కువసార్లు ఆయన అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ కూడా బలంగా ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్‌ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదని నేతలు వాపోతున్నారు. ఇక్కడ పార్టీ ఓడిపోవడం రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారిందని వారు చెబుతున్నారు. సొంతూరున్న నాగర్‌కర్నూల్‌ నియోజవర్గం, ప్రతిష్టాత్మంగా తీసుకుని తన స్నేహితుడికి టిక్కెట్‌ ఇప్పించుకున్న భువనగిరిలో హస్తం పార్టీ హవా కొనసాగడం రేవంత్‌కు ఊరటనిచ్చింది. దీంతోపాటు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని చేవెళ్ల టిక్కెట్‌ ఇప్పించగా ,అ ది బెడిసికొట్టడం సీఎంకు మింగుడు పడటం లేదు. వీటినిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే…

Spread the love