అల్పాహారం ఆగింది

Breakfast stopped– గతేడాది అక్టోబర్‌ 6న పథకం ప్రారంభం
– రాష్ట్రంలో 27147 స్కూల్స్‌లో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
– నిధుల్లేక ఇవ్వలేమంటున్న అధికారులు
– కొనసాగించాలంటున్న విద్యార్ధులు
– మానవీయ కోణంలో అమలు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిది
”విద్యార్థుల హాజరు పెంచడం.. పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండేలా చూడటం. తల్లిదండ్రులపై భారం తగ్గించడం” వంటి ప్రధాన ఉద్దేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించడం పేద పిల్లలకు వరం లాంటిదే. గత ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది.ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌ను గత ప్రభుత్వం ప్రకటించలేదు.. సరైన మార్గదర్శకాలూ లేవు. దాంతో ఎన్నికల అనంతరం ప్రభుత్వ స్కూల్స్‌లో అల్పాహార పథకం అమలు కావడంలేదు. పదోతరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. మానవీయ కోణంతో ఆలోచించి విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా పథకాన్ని అమలుచేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం కూడా అందించాలని గతేడాది అక్టోబర్‌ 6న గత ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 3161 ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి జిల్లాలో 1262, మెదక్‌ జిల్లాలో 923, సిద్దిపేట జిల్లాలో 976 స్కూల్స్‌ ఉండగా 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అల్పాహార పథకం ద్వారా విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్‌ అందిస్తారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రారంభించింది. వారంలో ఆరు రోజులు.. వివిధ రకాల అల్పాహారం అందించాలని మెనూను ప్రకటించింది. పథకం అమలును పర్యవేక్షించేందుకు పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు, గ్రామాల్లో అదనపు కలెక్టర్లు బాధ్యత చూడాలని కూడా అప్పటి ప్రభుత్వం ఆదేశించింది.
సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ మెను
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకంలో రోజువారీగా విద్యార్థులకు పెట్టాల్సిన మెను ఇలా ఉండేది. సోమవారం ఇడ్లీ-సాంబర్‌ లేదంటే గోదుమరవ్వ ఉప్మా-చట్నీ, మంగళవారం పూరీ ఆలుకుర్మా లేదా రవ్వతో టమాటాబాత్‌, సాంబారు, బుధవారం ఉప్మా, సాంబర్‌ లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ, గురువారం చిరుధాన్యాల ఇడ్లీ సాంబారు లేదా పొంగల్‌, సాంబారు, శుక్రవారం ఉగ్గాని/అటుకులు/చిరుధాన్యాల ఇడ్లీ, చట్నీ లేదా గోదుమరవ్వ కిచిడీ, చట్నీ, శనివారం పొంగల్‌, సాంబారు లేదా వెజిటబుల్‌ పులావ్‌, రైతా, ఆలుకుర్మా పెట్టేది.
నిలిచిన అల్పాహారం
కారణాలు ఏమైనా ప్రస్తుతం అల్పాహార పథకం ఆగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది పేదల నోటికి ముద్ద అందించే అల్పాహార పథకాన్ని కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి జిల్లాలో దాతలు, స్థానికంగా ఉన్న పరిశ్రమల సహకారంతో స్నాక్స్‌ పెట్టిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన అల్పాహారం మాత్రం ఇవ్వట్లేదు.
ఉదయం వచ్చి.. పరీక్షలకు కుస్తీ
పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని, ఎక్కువ మంది విద్యార్థులు 10 జీపీఏలో ఉత్తీర్ణులు కావాలనే ఉద్దేశంతో అదనపు క్లాసులు తీసుకుంటున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు స్కూల్‌లోనే ఉంటున్నారు. మధ్యాహ్న భోజనం తప్ప ఎలాంటి ఆహారం లేకపోవడంతో అర్ధాకలితోనే చదువుకుంటున్నారు. అల్పాహార పథకం అమలు చేస్తే విద్యార్థులందరితో పాటు అదనంగా రెండు గంటల పాటు స్కూల్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్‌ ఇస్తే మరింత శ్రద్దగా చదువుకుంటామని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.
నిధుల్లేక అల్పాహారం ఆగింది
అల్పాహార పథకం ద్వారా ఉదయం పూట స్కూల్స్‌ ప్రారంభానికి ముందే 8.45 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందించేది. పిల్లల హాజరు శాతం పెరగడం, తల్లిదండ్రులకు భారం తగ్గించడం కోసం పథకాన్ని పెట్టారు. నిధులు రాకపోవడంతో ప్రస్తుతం అల్పాహారం ఇవ్వడంలేదు.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి.
అల్పాహారం అందివ్వాలి
ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందివ్వాలి. లక్షలాది మంది విద్యార్థులకు ఉపయోగపడుద్ది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులే ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. వారందరికీ లబ్దిచేకూర్చే పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట స్నాక్స్‌ ఇవ్వాలి.
– రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి.

Spread the love