అన్నగారి కుటుంబం

Brother's family‘కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, మచ్చలేని మను షులకు అచ్చమైన ప్రతిబింబం’ అని సినారె గారు పాట రాశారు. అన్నా అని ఎంతో ఆప్యాయతతో పిలుస్తారు తెలంగాణలో. మనిషి చిన్నవాడైనా మర్యాదపూర్వకంగా అన్నా అనడం కొందరి అలవాటు కూడా. ఒక అనకొండ వచ్చి వాన పాముతో మనిద్దరం అన్నదమ్ము లమంటే ఆ వానపాము నమ్ముతుందా!! మనసంతా స్ఫోటకపు మచ్చలు పెట్టుకొని భాయిభాయి అంటే విన డానికే ఎబ్బెట్టుగా, భయంగా ఉంటుంది. నీవు నిజంగా భాయిలా ఎవరిని చూశావు అని ఎదురుప్రశ్న వేస్తే సమాధానం హుళక్కి. అప్పుడెప్పుడో ఓ పిన్ని వచ్చి మీకు తల్లి మాత్రమే కాదు ఓ చిన్నమ్మ కూడా ఉందని గుర్తు పెట్టుకొండి, కొన్ని సీట్లయినా ఇవ్వండని మొరపెట్టు కోవడం చూశాము. తరువాతది గతం.
కుటుంబం నిర్వచనం మారిపోతున్న రోజులివి. కొద్దిమంది సభ్యులు అదీ రక్త సంబంధీకులు కలిస్తే కుటుంబం అవుతుంది. అదే విధంగా ఒకే ఆలోచనలున్న మనుషులు, సమూహాలు కూడా తమది కుటుంబమనే అంటుంటాయి. అది మంచి కుటుంబమా ప్రజల్ని ముంచే కుటుంబమా అన్నది వేరే సంగతి. ఏమైనా ఈ మంచి, చెడు అన్నీ సంబంధితమైన అర్థాలున్నవి అంటే ఒకదానితో ఒకటి పోల్చి వీటి అర్థాన్ని వెదకాలి మరి. రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే వెంటనే చిన్న భార్య చెడ్డదా? అని అడుగుతారు. ఈ రాజ్యంలో మంత్రి వర్యులు మంచి వారు అంటే రాజు కథ ఏమైనట్టు? అదే భార్యాభర్తల విషయంలో కూడా అంతే, ఆయనా చాలా మంచోడబ్బా అంటే తరువాతి విషయం అర్థం చేసుకోవాలి.
అన్నయ్య, పెద్దన్నయ్య అంటె కొన్ని అధికారాలే కాదు ఎక్కువ బాధ్యతలుంటాయి. విజయబాపినీడు సిని మాలోలా ఇంట్లో పెద్దన్నయ్య మంచోడైతే ఒక తమ్ముడు చెడు తిరుగుళ్లు తిరిగి పాడైపోతున్నోడు ఉంటాడు. వాడిని అలా చూపిస్తేనే పెద్దోడు మంచోడయ్యేది. అంతా చెడ్డోళ్ళయినా కష్టమే, అంతా మంచోళ్ళయినా కష్టమే కథ రాసేవాళ్ళకు. ఏమన్నా అంటే చేతిలో అన్ని వేళ్లూ ఒకటే ఉన్నాయా, అయినా పిడికిలి బిగిస్తే అన్నీ ఒకే సైజుకు వస్తాయి అంటారే కాని మానవుడి పరిణామ క్రమంలో అవి అలా తయారయ్యాయని ఎంత చెప్పినా వినరు. ఇది దేవుడి సృష్టి అని ఆయనకే ఎక్కువ మార్కులు వేసుకొని మనిషి శ్రమను తక్కువ చేసి చూపుతారు. ఏమన్నా అంటే దశావతా రాలు పరిణామ క్రమంలో భాగమని, అసలు డార్విన్‌ ఎవరు అనే స్థాయికి చేరారు. డార్విన్‌ కూడా దేవుడి సృష్టిలో భాగమే అంటే సరి! ఇక మాటలకు అవకాశమే లేదు, ఉండదు కూడా.
పాండవుల సంగతే తీసుకొండి, అన్న ధర్మరాజు ఎంత చెబితే అంత. చివరికి జూదంలో మొత్తం పోగొ ట్టుకునేవరకు జరిగిందేమో అందరికీ తెలుసు. అందుకే ఎంత అన్నగారైనా సరే ఆయన ఏది చెబితే అదంతా నమ్మడం, చేసెయ్యడం చేయకూడదు ఈ కాలంలో. ఆయనపై ఓ కన్ను వేసి ఉంచాలి. అవసరమైతే ప్రశ్నిం చాలి. ఒక్కోసారి ఆయన తప్పుడు సలహా ఇస్తాడు. అది పాటిస్తే నీకు ఓ జీవితకాల నష్టం కలగొచ్చు. అందుకే తస్మాత్‌ జాగ్రత్త. అన్న, అది ధర్మరాజైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా సరే ఏమి చెబుతున్నాడు, ఎలా చెబు తున్నాడో బేరీజు వేసుకోవాలి. అన్నగా మాట్లాడుతున్నా అనుకుంటూ శకుని డైలాగులు చెప్పే అన్నగార్లూ ఉన్న ప్రపంచమిది.
అన్నగారి కుటుంబం అంటే ఏమిటో దాని పరిస్థితి ఏమిటో చాలా దగ్గరగా గమనించాలని ముందే అను కున్నాం. ఆ కుటుంబంలో మంచి సలహాలు ఇచ్చే వాళ్లు, చెడు చెప్పేవాళ్లు, సీరియస్సుగా ఉండేవాళ్లూ, అందరినీ నవ్విస్తూ సాగి పోయేవాళ్లూ ఇలా అన్నిరకాల మనుషు లతో నిండి ఉండాలి. అప్పుడే అది ఉగాది పచ్చడిలా రుచిగా, శుచిగా ఉంటుంది. కల్మషాలు ఉండకూడదు. పరమానందయ్య శిష్యుల లాంటివాళ్లు దొరికే కాలం కాదిది. తమ పనికోసం ప్రత్యేకమైన యూనివర్సిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజల మనసుల్లోకి తెలీ కుండా దూరి ఆట చూస్తున్న రోజులివి. వాటికి సమాధా నాలిస్తూ కూచోవడం కొందరు చేసినా, ఇంకొందరు వారికి, వాళ్ళ ఆలోచనలకి దీటుగా తామే కొన్ని ప్రశ్నల్ని తయారు చేసి వదలాలి. అప్పుడే ఎన్ని తప్పుడు సమాధా నాలిస్తారో ప్రజలకు, భక్తులకు తెలిసేది.
చెప్పేది ఏదైనా ప్రతిదీ ఒక క్లైమాక్సులా ఉండేలా చెప్పాలి. అప్పుడే జనాలు ఇటువైపు చూస్తారు. ఒకాయన ఓ మంచి విషయం చెబితే దానికి విరుద్ధంగా వెంటనే కామెంట్లచ్చి దానికి వేరే రంగు పూసి ఒక విధంగా మసి పూసి మారేడుకాయ చేసి అంటుంటారు కదా, అలా చేసేవాళ్లు మాంచి ట్రైనింగు తీసుకొంది సిద్ధంగా ఉన్నారు. ప్రవాహానికి ఎదురీదాలనుకోవడం ఏమంతా తమాషా విషయం కాదు. మొదట కొట్టుకుపోకుండా జాగ్రత్త పడి తరువాత ముందుకుపోతూ ఉండాలి. ఒకరి కంటే ఓ సమూహం ఎప్పుడూ గొప్పది, దాని ఉద్దేశ్యాలు మంచివైనప్పుడు. చేయిచేయి పట్టుకొని ఎంతటి వరదనైనా సులభంగా దాటచ్చు.
అందుకే మొదట మంచి గ్రూపులను తయారు చేసుకోవాలి. అల్లోపతి మందులు వేసుకుంటే చెడు సూక్ష్మ జీవులతో పాటు మంచివి కూడా కొన్ని దూరమ వుతాయి. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఒక్కో కణం పెరిగి పెరిగి క్యాన్సరు గడ్డలా మారకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా పెరిగిన క్యాన్సరు గడ్డను తీసెయ్యాలి, అది అన్నగారైనా సరే. అన్నగారి కుటుం బంలో తమ్ముళ్లు కూడా ఉంటారని గమనించాలి. ఎవరి బాగోగులు వాళ్లు చూసుకుంటూ ఉంటారు, ఉండాలి కూడా. నిజమైన అన్నగారైతే తానే ఆ పనిచేస్తాడు. యూజ్‌ అండ్‌ త్రో అన్నగారైతే తన పని అయ్యేవరకే, తరువాత తన దారి తాను పోతాడు. అందుకే అన్నగారి కుటుంబమంటే అందరూ బాగుండాలి అనుకునే కుటుం బమని తెలుసుకోవాలి మొదట. ఆ విషయం బోధపడ్డాక ఏ అన్నగారు ఎలాంటివాడో సులభంగా అర్ధమై పోతుంది. అర్ధం చేసుకోవాలి కూడా. అప్పుడే జనాలు అర్ధమవుతారు, అర్ధవంతంగా…
జంధ్యాల రఘుబాబు
9849753298

Spread the love