నెత్తుటి బాకు

ఎగిరెళ్లిపోయిన పక్షిపాటలాంటి
అతని సెలయేటి పిలుపులు
అడవికి తిరుగుబాటు గేయం నేర్పిన
ఆ ధిక్కార స్వరపు జాడ తెలియక

ఎర్రెర్రని అగ్గిపూలన్నీ నల్లకంబలి కప్పేసుకుంటే
తుడిచే ఓదార్పు చేతుల్లేక నిద్రించని
కొండ కన్నీళ్లు జలపాత ధార కట్టాయి
కోనలోని ప్రతి చెట్టు కీచురాళ్ళ సాయంతో
అదేపనిగా రోదిస్తుంటే
మిణుగురుసైన్యం దీపాలు ఆర్పేసి
రహస్య రాస్తాల్లో గస్తీకాస్తున్నాయి

మోదుగపూగుత్తుల ముందు
అడవి ఈగలన్నీ దీక్ష చేస్తుంటే
తంగేడు గుబురుల్లో చీమలదండుకు
సమ్మెమేఘం కమ్మింది చుక్కల దుప్పటి కప్పి
అడవికి కాపుగాసే ఆకాశం
దిగులురంగు పులుముకుంది

నీలమంతా రెక్కల్లో దాచుకున్న పాలపిట్ట
రంగు ఈకలను సమాధి చేస్తూ
మొక్కులు తీర్చుకుంటుంటే
తండాలోని దండేలన్నీ గుత్తగా
ఎర్రజెండాలను పూస్తున్నాయి
గుడిసెలోని మట్టిగుండెలు
ఎదురుచూపుల పగుళ్లను
కన్నీళ్లతో మెత్తుకుంటున్నాయి

దిక్కులు దాటి అస్తమించిన
ఆ నెత్తుటిబాకు ఏనాటికైనా ఏదొక దిక్కున
వెలుగుతీరమై కానొస్తాడని
లెక్కలేని చుక్కల దివిటీలు చేతబట్టి
చెరబట్టిన చీకటిని తగలబెట్టేస్తాడని

అణచివేత గాయాలకు
ప్రేరణవాక్యాల లేపనం పూసి
గుంపుగట్టిన దోపిడీ రాబందుల
గొంతులు మూకుమ్మడిగా కోసి

వసివాడిన అడవికొమ్మకు
ఉపశమన తోరణాలు కట్టి
విరిగి రాలిన అమాయక రెక్కలకు
వొబ్బిడిగా అంటుకట్టి
నిత్యం కన్నీటి తైలంతో వెలిగే
గుప్పెడు బ్రతుకు ప్రమిదలకు
తన శ్వాశతెరలు ఆసరాగా
ఎర్రగజ్జె కట్టిన ఆటపాటలతో

ఇక ఎప్పటికీ పహారా స్థూపమై
నిలిచిపోతాడనే పడిగాపులతో
చీకటి తీరాలను తడుముతున్న
కొండకోనల కళ్ళు ధీమాగా మెరిసేదెప్పుడో ..!
అడవంతా తలయెత్తుకు నిలిచేదెప్పుడో…!!

– మిరప మహేష్‌, 9948039026

Spread the love