దర్జాగా.. యమ దర్జాగా…

‘దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర…’ ఇది పాత ముచ్చట. ‘దొరికినా కూడా దొరే…’ ఇది సరికొత్త ట్రెండ్‌. అవును మరి… పాలక పార్టీలకు నచ్చితే ఒకలాగా.. నచ్చకపోతే మరోలాగా ఉంటుంది పరిస్థితి. మునుగోడు ఉప ఎన్నికల ముందు రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన మనందరికీ గుర్తుండే ఉంటుంది. అదే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. హైదరాబాద్‌ నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో నడిచిన ఈ బాగోతం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కాషాయ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్ద తలకాయలకు ఈ కేసులో ప్రమేయముందంటూ పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పం పారు. కోర్టులో వాదనలు, ప్రతి వాదనలు, రిమాండ్లు, విచారణలు యమ సీరియస్‌గా నడిచాయి. ఇవి కొనసాగుతుండగానే కాలం గిర్రున తిరిగి ఏడాది గడిచి పోయింది. ఇప్పుడు ఎన్నికల సీజన్‌ మొదలైంది. హస్తినాపురి నుంచి హైదరా బాద్‌కు జాతీయ నేతల రాక మొదలైంది. సభలు, సమా వేశాలు, సమా లోచనలు, మంతనాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కమలం పార్టీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావే శానికి ఢిల్లీ నుంచి నాయకగణం దిగింది. షరా మామూలుగా ఎన్నికల గురించి మాట్లాడుకు న్నారు. అయితే దేశ రాజధాని నుంచి ఇక్కడకు వచ్చిన నేతల్లో ఒకరిని చూసి మీడియా మిత్రులు ముక్కున వేలేసుకున్నారు. గతంలో ఎమ్మెల్యేల కేసులో కీలక పాత్ర, సూత్రధారిగా ఉన్న ఆ నాయకుడు దర్జాగా.. యమ దర్జాగా… కాలరెగరేసుకుంటూ ఆ మీటింగుకు వచ్చాడు. సమావేశం ఆసాంతం పాల్గని నేతలకు కీలక సూచనలు చేశాడు. ‘అరే.. లోపల ఉండాల్సిన వాడు బయటకొచ్చి తెగ ఫోజులు కొడుతున్నాడు.. రాజకీయమంటే ఇదేనేమో…’ అనుకుంటూ పాత్రికేయులు అక్కడి నుంచి ముందుకు కదిలారు.
– బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love