నాయాల్ది కత్తందుకో జానకీ…

‘పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పితే తీవ్ర చర్యలుంటాయి. ఎంతటి వాళ్లయినా, అది పెద్దోడయినా, చిన్నోడయినా ఏ మాత్రం చూసేది లేదు. తీసి అవతల పారేస్తాం…’ గులాబీ బాస్‌ కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులనుద్దేశించి పలుమార్లు చెప్పిన మాటలివి. నిజమే మరి… అధినేత ఆదేశాలను పాటించే 60 లక్షల మంది సైన్యం, ఆయన మాటలను తూ.చా.తప్పకుండా పాటించే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు. సారు గీసిన గీతదాటని లక్ష్మణుల్లాంటి పరివారం, అనుయాయులు, మద్దతుదారులు. హైదరాబాద్‌లో ఒక్క జీవోను విడుదల చేయగానే రాష్ట్రవ్యాప్తంగా పోరగాళ్లకు తాగటానికి కూడా దొరక్కుండా పాలన్నింటినీ బిందెలకు బిందెలుగా పోసి ఫొటోలకు క్షీరాభిషేకం చేసే లక్షలాది మంది అభిమానగణం బీఆర్‌ఎస్‌ అధినేత సొంతం. అందుకే గత పదేండ్లుగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో వచ్చే సమస్యలు, ఆటుపోట్లు, ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడా అదరకుండా, బెదరకుండా ముందుకు సాగుతున్నారు కారు సారు. అలా దూకుడు మీదున్న ‘కారు’కు ఈ మధ్య ఓ సీనియర్‌ నేత బ్రేకులేశారు. మొన్నటిదాకా ఎమ్మెల్సీగానే ఉన్న ఆయనకు కాకుండా 2018లో ఆయనపై గెలిచిన ఓ యువ ఎమ్మెల్యే (కాంగ్రెస్‌లో గెలిచి, ఆ తర్వాత కారెక్కారు)కే సీఎం సాబ్‌ ఈసారి కూడా టిక్కెట్‌ను కేటాయించారు. దాంతో తిరుగుబాటు జెండా ఎగరేసిన ఈ సీనియర్‌… ‘నాయాల్ది కత్తందుకో జానకీ…’ అంటూ రెబల్‌ స్టార్‌ కృష్టంరాజు లెవల్లో ఆగ్రహోదగ్రుడయ్యారు. ‘నాకు టిక్కెట్‌ ఇవ్వకుండా వేరే వారికి ఇస్తారా..? ఈ జిల్లాలో పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తా..? నా తడాఖా చూపిస్తా…’ అంటూ అధిష్టానికే సవాల్‌ విసిరారు. అంతే… క్షణాల్లో సీన్‌ మారిపోయింది. ఆ ఎమ్మెల్సీని మంత్రి పదవి వరించింది. రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఎంతైనా ఎన్నికల సమయం కదా..? -బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love