డిస్‌క్వాలిఫై…

‘నీతిగా, నిజాయితీగా కష్టపడి పని చేసేటోడికి ఇప్పుడు విలువ లేదు. ఒంటికి మట్టిఅంటకుండా సుఖంగా కూర్చుని… సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేవాడివే రోజులు…’ టిక్కెట్‌ మీద గంపెడాశలు పెట్టుకుని, అది రాక పోవటంతో నిర్లిప్తతతో అధికార పార్టీకి చెందిన ఓ లీడరు ఇటీవల అన్న మాటలివి. నిజమే మరి… ఎమ్మెల్యే అంటే మందీ, మార్బలం, పెద్ద పెద్ద కార్లు, అంతకు మించిన హంగామా…వెనుకో పది కార్లు, ముందో పది కార్లు ఉండాల్సిందే. అలా ఉంటేనే… ఆయనకు ఎమ్మెల్యేగా గుర్తింపు దక్కుతున్న రోజులివి. గతంలో ఎలాంటి ఆర్భాటాల్లే కుండా సాదాసీదాగా సచివాలయానికి వచ్చిన సున్నం రాజయ్యను అక్కడి ప్రధాన ద్వారం వద్దే ఆపేసిన ఘటన మనకు ఇంకా గుర్తేఉంది. ఇదే రకంగా తనపని తాను చేసుకుపోతూ… అట్టహాసాలు, ఆర్భాటాలకు దూరంగా ఉన్న తనకు మాత్రం ఎన్నో ఏండ్ల నుంచి అన్యాయం జరుగుతున్న దంటూ వాపోయారు టిక్కెట్‌ దక్కని ఆ పెద్ద మనిషి. కర్ర ఉన్నోడిదే బర్రెన్నట్టు…డబ్బులు, ఆస్తులు, అంతస్తులు చూసి గానీ పార్టీలో పదవులివ్వటం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని గులాబీ పార్టీలోని కొందరు అగ్రనేతల వద్ద ప్రస్తావిస్తే… ‘మీరు మంచోళ్లు..మచ్చలేనోళ్లు.. మీ గురించి అంతా మాకు తెలుసు. కానీ ఇప్పుడు మీలాంటి వారు ఎన్నికల్లో రాణించలేరు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించాలి. తిమ్మిని బొమ్మిని చేయాలి. దూకుడుగా వ్యవహరిస్తూ నోటి మాటలతో ఎదుటి పార్టీ వాడి నోర్మూయించాలి. అవన్నీ మీకు చేతగాదు సార్‌…అందుకే ప్రస్తుత రాజకీయాల్లో మీరు డిస్‌క్వాలిఫై అవుతారు…’ అంటూ సర్ది చెప్పారని సదరు నేత నిరుత్సాహంతో కూడిన నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. నిజమే మరి…గతంలో ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారు. ఇప్పుడు వ్యాపారవేత్తలు, పరిశ్రమాధిపతులు ఆ రంగంలోకి చొరబడ్డ తర్వాత ఎన్నికలు, ఓట్లు సరుకు మాదిరిగా మారిపోయాయి.అదే అసలు సమస్య.
– బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love