వెయిట్‌ అండ్‌ సీ…

రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం మస్తు రంజుగుంది. ‘రాజకీయమంటే ఏటనుకున్నవ్‌… కడుపులో కత్తులు పెట్టుకుని… ఏమీ తెలియదన్నట్టు కౌగిలించుకోవాల…’ అని నటవిరాట్‌ రావుగోపాలరావు డైలాగ్‌ కొట్టినట్టు ఇప్పుడు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ లీడర్లు ఇప్పుడు కడుపుల తలకాయ పెట్టి మరీ రాజకీయాలు నడుపుతున్నారు. ఇప్పటిదాకా ఒక పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడు… ఇప్పుడు అదే పార్టీలో టిక్కెట్‌ కోసం నానా పాట్లు పడుతున్నాడు. ఈరోజు వరకూ సొంత పార్టీలో ఉండి… అక్కడి అధినేతను ఆహా ఓహో అంటూ పొడిగి, తీరా టిక్కెట్‌ రాదని తెలిసే సరికి… అదే అధినేతకు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన గళాలు విప్పుతున్నారు మరికొందరు లీడర్లు. మరోవైపు సంప్రదింపులు, బుజ్జగింపులు, సమాలోచనలు, చర్చలు, మంతనాలు జోరందుకున్నాయి. వీటి కోసం హైదరాబాద్‌కు వచ్చే ఎమ్మెల్యేలు, ఆశావహులు, చోటా మోటా నేతలతో హైదరాబాద్‌లోని హోటళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నాయకుల సంప్రదింపుల క్రమంలో ఏడుపులు, పెడబొబ్బలు, అసహనాలు, కోపాలు, తాపాలు ఏక్కువై పోతున్నాయని అక్కడి నుంచి వచ్చిన నేతలు వాపోతున్నారు. టిక్కెట్ల జాబితాలు ప్రకటించకముందే, ఇంకా అభ్యర్థిత్వాలు ఖరారు కాకముందే సీను ఇలాగుంటే… అవి ఖరారయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకోవటానికే భయంగా ఉందంటూ అధికార పార్టీకి చెందిన ఓ నేత వాపోయారు. ఆయన అలా వాపోవటంలో ఎంతో అర్థముంది. ఎందుకంటే… ఇలాంటి సీన్లు మున్ముందు వెండితెరపై మస్తుగుంటరు… వెయిట్‌ అండ్‌ సీ… -బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love