”ఫ్లయింగ్‌ కిస్‌”

”ఛీ! ఛీ! ఇదేం పాడుబుద్ధి!” అన్నది అసహ్యంగా మెహంపెట్టుకుని సరళ.
”ఏం పాడుబుద్ధి? ఎవరిది?” ఆసక్తిగా అడిగింది శ్రీలక్ష్మి.
”ఇంత అన్యాయమా? నిండు సభలో ఇట్లా చేయవచ్చా? ఇదేనా మన సంస్కృతి? అయినా బయటివారికి భారతీయ సంస్కృతి ఏం తెలుస్తుందిలే?” మరింత చిరాగ్గా అన్నది సరళ.
”ఇంతకూ నీవు ఎవర్ని గురించి అంటున్నావు! నన్నేనా?” గద్దించింది శ్రీలక్ష్మి.
”అయ్యో! వదినా నిన్నెలా అంటారు! మొన్న లోక్‌సభలో ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడే ఆఁ పెద్దమనిషిని అంటున్నా!” అన్నది సరళ.
”ఓహౌ అదా! ఆఁ పెద్ద మనిషి నిజంగానే ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడంటావా? నాకైతే డౌటే!” అన్నది శ్రీలక్ష్మి.
”ఓహౌ అయితే నీవు కూడా ఖాన్‌ /గేస్‌ అన్న మాట!” అంటూ మూతి విరిచింది సరళ.
”డౌటు కూడా పడొద్దా! డౌటు పడితే కాంగ్రెస్‌లో ఉన్నట్లా” ఇద్దెక్కడి చోద్యం?” అంటూ నోరు నొక్కుకుంది శ్రీలక్ష్మి.
”నిండు సభలో ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చేవారిని, దీన్ని సమర్థించిన వారిని పీకపిసికి చంపెయ్యాలి. రోడ్డు మీద పండబెట్టి రోలర్‌ నడిపించాలి. బుల్డోజర్‌తో ఏకీలుకు ఆ కీలు పీకించెయ్యాలి. శూలదండను విధించాలి! క్రిమి భోజనం కావించాలి… ఆవేశంగా చెప్పుకునిపోతోంది సరళ.
”ఆగాగు వదినా! గరుడ పురాణంలో లేని శిక్షలు విధించుతున్నావు!” అంటూ ఆపింది శ్రీలక్ష్మి.
”గరుడ పురాణమే కాదు, కాకి పురాణం, పిచ్చుక పురాణం అన్ని పురాణాల్లోని శిక్షలు విధించాల్సిందే!” ఢంకా బజాయించింది సరళ.
”కాకి పురాణం, పిచ్చుక పురాణాలు లేవనుకుంటా!” అనుమానంగా అన్నది శ్రీలక్ష్మి అనుమానంగా.
”లేకపోతేనేం! వాట్సప్‌లో వెదికితే అవే దొరుకుతాయి! దొరక్కపోతే కాకి పురాణం, పిచ్చుక పురాణాల్లో ఫ్లయింగ్‌ కిస్సులకి ఇవే శిక్షలంటూ వాట్సప్‌లో పేర్లు లేకుండా మనమే పోస్టు చేద్దాం!” అన్నది మరింత ఆవేశంగా సరళ.
”ఫ్లయింగ్‌ కిస్సులకే ఇన్ని శిక్షలుంటే, నిజంగా ముద్దు పెట్టుకుంటే ఇంకెన్ని శిక్షలు వేయాలో?” సాలోచనగా అన్నది శ్రీలక్ష్మి.
”ఆడపిల్లని ఇష్టం లేకుండా ముట్టుకుంటే చేతులు విరిచేయాలి. ముద్దు పెట్టుకుంటే పెదాలు, నాలుక కోసేయాలి…” సరళకి ఆవేశం తగ్గటం లేదు.
”ఈ శిక్షలు ఆ ఒక్కాయనకేనా అందరికీ వేయవచ్చా?” అనుమానంగా అడిగింది శ్రీలక్ష్మి.
”ఆడపిల్లలంటే ఎవరనుకున్నావు సాక్షాత్‌ భరతమాత స్వరూపం! అందుకే ఆ ఒక్కడికే కాదు, ఎవరికైనా అవే శిక్షలు విధించాలి. ద్రౌపదిని తొడల మీద కూర్చోమని సైగచేసినందుకే ధుర్యోదనుడి తోడలు తన గదాదండంతో భీముడు విరగొట్టాడు. అదే సరైన శాస్తి! అదే మన సంస్కృతి” ఆవేశపడుతూనే అన్నది సరళ.
”అవునవును! ఫ్లయింగ్‌ కిస్సులు, ముద్దుల తర్వాత మానభంగమే కదా! దానికెలాంటి శిక్ష విధించాలి!” అడిగింది శ్రీలక్ష్మి.
”మానభంగం చేసిన వారికి మరణదండనే సరైన శిక్ష” అన్నది సరళ.
”మరి మణిపూర్‌లో ఎంత మందికి మరణదండన విధించారు?” సూటిగా ప్రశ్నించింది శ్రీలక్ష్మి.
సరళకి ఒక్కసారిగా ఆవేశం తగ్గింది! ఏం మాట్లాడాలో తోచలేదు. ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేశారు కదా!” అన్నది కాసేపటికి.
”ఇప్పటిదాకా ఉరిశిక్ష అంటివి, ఇప్పుడేమో ఎఫ్‌ఐఆర్‌తో సరిపెడుతున్నావు! ఇదెక్కడి న్యాయం వదినా? అడిగింది శ్రీలక్ష్మి.
”అంటేఁ ఆ తర్వాత కేసు పెడతారు కదా!” అన్నది సరళ.
”ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయటానికి 40రోజులు పట్టింది. అది కూడా ఒక అమ్మాయి నగంగా ఊరేగించే వీడియో వైరల్‌ అయ్యిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ గురించి మాట్లాడుతున్నారు! మణిపూర్‌ మనదేశంలో లేదా? లేక ఆ అమ్మాయి చైనా అమ్మాయా? ఆ అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసి, అడ్డం వచ్చిన తమ్ముడిని, తండ్రిని కిరాతకంగా హత్యచేసి వారిని నగంగా ఊరేగించిన వాళ్ళకి ఇప్పటిదాకా ఎలాంటి శిక్షలు వేశారు?” ప్రశ్నించింది శ్రీలక్ష్మి.
”చట్టం తన పని తాను చేసుకుని పోతుంది!” అన్నది సరళ గొంతు పెగల్చుకుని.
”మణిపూర్‌ ముఖ్యమంత్రి చెప్పిందే నీవు చెబుతున్నావు. ఇలాంటివి వందల కొద్దీ జరిగాయని ఆయన అన్నాడు. ఒక్కదాంట్లో కూడా శిక్ష విధించలేని దద్దమ్మకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు?” తీవ్రంగా ప్రశ్నించింది శ్రీలక్ష్మి.
”మణిపూర్‌ మహిళల వెనక దేశమే ఉంది!” అన్నది సరళ తడారిపోయిన గొంతుతో.
”అవును! వారి వెనక దేశమే ఉంది! కాని మీరు లేరు, మీ పార్టీ లేదు! మీ డబుల్‌ ఇంజన్‌ సర్కారు లేదు! ఇందుకు మీరు సిగ్గుపడటం లేదు! పైగా ఫ్లయింగ్‌ కిస్సుల మీద రాద్ధాంతం చేస్తారు? మణిపూర్‌ ఒక్కరోజు, ఒక్క నిమిషం కూడా స్పందించని మహానుభావురాలు. ఈ దేశ సంస్కృతికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా మాట్లాడే అర్హత ఉందా? సాటి మహిళల గురించి మాట్లాడని ఆ మనిషి ఆడమనిషేనా? కనీసం మనిషేనా?” ఆగ్రహంగా అన్నది శ్రీలక్ష్మి.
సరళ బిత్తర చూపులు చూస్తున్నది.
”చట్టం గురించి మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది! అత్యాచారం చేసినట్లు రుజువై చట్టం జైలుశిక్ష విధించితే మీ సర్కార్‌ ఆ దోషులలో సత్ప్రవర్తనను వెదుక్కుని శిక్ష తగ్గించి విడుదల చేసింది. విడుదలైనా ఆ దుర్మార్గులను సన్మానించారు మీ పార్టీవారు! ఆ సన్మానానికి గంగవెర్రులెత్తి మరో అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు మీరు విడుదల చేసిన కీచకుడు. ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ సంప్రదాయం?” మరింత కోపంగా అన్నది శ్రీలక్ష్మి.
సరళికి నోరు పెగలటం లేదు!
”మీ డబుల్‌ ఇంజన్‌ సర్కారు స్పందించవచ్చు. ఈ అకృత్యాలను అడ్డుకోవచ్చు. కాని మీకు ఆ సోయ లేదు. ఎందుకంటే మీది కీచక సంస్కృతి, కౌరవ సంస్కృతి! రాబోయే కాలంలో నిజమైన భారతీయ సంస్కృతి అంటే ఏమిటో చూస్తారు!” అంటూ ముగించింది శ్రీలక్ష్మి.

Spread the love