అభాసుపాలైన అంతర్జాతీయ అభాండం

మీడియాలో, సోషల్‌ మీడియాలో భిన్నాభి ప్రాయాలు, విమర్శలు చేసేవారిపై నరేంద్రమోడీ ప్రభుత్వం దాడులు, నిర్బంధాలు కొత్తకాదు. గానీ ఇటీవలి కాలంలో అందుకోసం అనుసరిస్తున్న పద్ధతులే మరీ ఘోరంగా తయారైనాయి. దేశభక్తి తమ స్వంతమైనట్టు మిగిలినవారంతా దేశద్రోహులైనట్టు చిత్రిస్తూ అబద్దాలు ప్రచారం చేయడం ఒక వ్యూహంగా మారింది. ఇటీవలి రోజులలో న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌పై దారుణ దుష్ప్రచారం అందులో తాజా అధ్యాయం. ఈ దాడిలో అంతర్జాతీయ మీడియా కూడా భాగస్వామి కావడం చూస్తే కుట్రలు ఎంత పకడ్బందీగా నడుస్తాయో అర్థమవుతుంది. ఈ మాయాజాలంలోకి నెమ్మదిగా సీపీఐ(ఎం) నేతలనూ, తర్వాత కాంగ్రెస్‌నూ కూడా కలుపుతూ కేంద్రమంత్రులే రభసచేయడం, మీడియా దానికి విపరీత ప్రచారం ఇవ్వడం రాజ్యసభలో హక్కుల నోటీసు ఇచ్చాక చప్పున ఇప్పటికీ సర్దుకోవడం గమనించవచ్చు. అయినా వివిధ మీడియాలలో సంఫ్‌ు పరివార్‌కూ సామ్రాజ్యవాదానికి అనుకూలమైన వేదికలలో వాటినీ అటూ ఇటూ తిప్పి తిప్పి చూపెడుతూ కొత్త విషయంలా ప్రచారం నడిపిస్తున్నారు. అందుకు దీనిపై నిజానిజాలు చెప్పుకోవలసిన అవసరమేర్పడుతున్నది. ఇంతా చేస్తే వడ్లగింజల్లో బియ్యం గింజలా అందులో ఉన్నది అచ్చంగా అదే కథ. ఎన్నిసార్లు రాసినా ఎంత చెప్పినా అదే రొద. 2021లో ఇదే న్యూస్‌క్లిక్‌ ఆఫీసుపై దాడిచేసి దిగ్బంధనంతో సిబ్బందిని నిర్బంధం చేసి ఏదో కనిపెట్టినట్టు కథలు వదిలారు. అయితే తర్వాత ఢిల్లీ హైకోర్టు వాటిని నిలిపేసింది. మళ్లీ ఇప్పుడు దేశమంతా మణిపూర్‌ విషయమై ఆందోళన చెందుతున్నప్పుడు ఈ కథ పునఃప్రారంభమైంది. అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ఏదో కథనం ప్రచురించడం ఇందుకు ఆధారమైంది. పోనీ ఆ కథలో అక్రమాలు లేదా చట్ట విరుద్ధమైన దేశ వ్యతిరేకమైన ఆరోపణల ఉదాహరణలు ఏమైనా పేర్కొన్నారా అంటే అదీలేదు. న్యూస్‌క్లిక్‌ యజమాని, ప్రధాన సంపాదకుడు అయిన ప్రజావైజ్ఞానిక మేధావి ప్రబీర్‌ పురకాయస్థకు అమెరికాలో సంపన్నుడైన నవెల్లి రారు సింగంకు మధ్య సంబంధాలున్నాయనే అరోపణపైనే ఆ కథనం నడిచింది. వారిద్దరూ మాట్లాడుకున్న వాట్సప్‌చాట్లు ఉదహరించబడ్డాయి. అదే సింగంతో పీపుల్స్‌డెమోక్రసీ సంపాదకుడైన ప్రకాశ్‌కరత్‌ సందేశాలుండటం అపరాధమైనట్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం సాగింది. దీన్ని న్యూస్‌క్లిక్‌, ప్రబీర్‌, ప్రకాశ్‌కరత్‌, సీపీఐ(ఎం) కూడా ఖండించినా పార్లమెంటులో కూడా ఇదే కథ ఆధారంగా ఆరోపణలు చేసి నాలుక కర్చుకున్నారు. ప్రజానుకూల ప్రత్యామ్నాయ కథనాలతో, పరిశోధనాత్మక సమాచారంతో న్యూస్‌క్లిక్‌ సుపరిచితం.
అంతాచట్టబద్దమే
ఇంతకూ న్యూయార్క్‌ టైమ్స్‌ రాసిందేమిటి? నోకోల్డ్‌ వార్‌(ప్రచ్చన్న యుద్ధం వద్దు) గ్రూప్‌ లండన్‌లో చేసిన ప్రదర్శనతో ఈ కథనం మొదలవుతుంది. అమెరికా పౌరుడైన నవెల్లి రారు సింగం మానవహక్కుల ఉద్యమాలకు, వామపక్ష పోరాటాలకు సహాయం చేస్తుంటాడని పేర్కొంది. ఈయన తండ్రి కూడా ప్రొఫెసర్‌గా ఉంటూ ప్రజాస్వామిక వాదులకు సహాయం చేసేవాడు. ఈయన భార్య ఇవెన్‌ కోడ్‌పింక్‌ పేరిట సామాజిక శక్తులకు సహాయపడుతుంటారు. ఆఫ్రికాలోనూ, బ్రెజిల్‌, ఇండియాలలోనూ ఉద్యమాలకూ వార్తా సంస్థలకు ఈయన తోడ్పడుతుంటారని టైమ్స్‌ రాసింది. ఈ విరాళాలు ఇవ్వడం అమెరికా చట్టాల ప్రకారం తప్పు కాదని కూడా ఆకథనంలోనే ఉంది. సింగం షాంఘైలో కార్యాలయం కలిగివున్నారని, ఆ భవనంలోనే చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రచార విభాగం కూడా ఉందని తెల్పింది. చైనాలోనూ, విదేశాలలోనూ కూడా ఆయన మీడియా వ్యాపారంలో ఉన్నాడని చెబుతూనే ఇది చైనా కమ్యూనిస్టుపార్టీ చెప్పినట్టు నడుస్తున్నట్టు ఆరోపించింది. అందుకోసం ఎలాంటి నిర్దిష్టమైన ఆధారాలు చూపిందా అంటే లేదు. ఆయన మరో ఇద్దరు చైనా యూనివర్సిటీతో కలసి వీడియోలు చేస్తుంటారని, వాటికి పెట్టుబడిలో కొంత భాగం చైనాపార్టీ సమకూరుస్తుందని మాత్రమే రాశారు. అంటే అది కూడా పూర్తిగా కాదు. ఈ సందర్భంగా జరిగిన ఒక వర్క్‌షాప్‌లో సింగం పాల్గొనడం కూడా తప్పులాగా చూపింది. ఎన్నెన్నో పనులు ఔట్‌సోర్సింగ్‌కు కాంట్రాక్టులకు ఇచ్చే ఈ కాలంలో ఒక యూనివర్సిటీ, ఓ విదేశీ మీడియా సంస్థకు వీడియోల తయారీ ఇస్తే అది రాజకీయ సంబంధమైపోతుందా? కొంత పెట్టుబడి చైనాపార్టీ సమకూర్చిందని తాడూ బొంగరం లేని రాత రాస్తే విలువెంత? ఇక వారు చూపించే సందేశాలు కూడా వార్తా ప్రసారాలకు సంబంధించినవే. చైనాలో కరోనాను ఎదుర్కొన్న తీరు గురించి మూడు పరిశోధనాత్మక కథనాలు రాసే విషయమై ప్రబీర్‌ పురకాయస్థ, ప్రకాశ్‌ కరత్‌లతో సింగం సమాచారం పంచుకోవడమే పెద్ద ఆధారంగా ఆ పత్రిక కథనం ప్రచారంలో పెట్టింది. అవైనా ఎంత నిజమనేది చూడవలసిన విషయమే.
పరస్పర ఆధార ప్రహసనం
ఇంతకూ ఇక్కడో ట్విస్టు ఉంది. న్యూయార్క్‌టైమ్స్‌ రాసిన కథనాన్ని మనదేశంలో బడా మీడియా వాడుకుంటే ఆ పత్రిక మాత్రం మోడీ ప్రభుత్వం న్యూస్‌క్లిక్‌పై జరిపిన దాడిని సోదాలను ఆధారాలుగా ప్రస్తావించింది. వాస్తవంగా రాసినభాష ఇది ”భారతీయ అధికారులు పత్రికలపై దాడిలో భాగంగా సింగంతో ముడిపడిన ఒక వార్తాసంస్థపై దాడి చేశారు. దానికి చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ఆరోపించారు గాని ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయారు.” తాను మొదటిసారిగా ఈ కార్యకలాపాలకు చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలకు ఆధారాలు సంపాదించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ చెప్పుకుంది. అయితే అవన్నీ తాడూ బొంగరం లేనివే. శాంతి, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమాలకు తాను సాయంచేస్తానని సింగం బహిరంగంగానే ప్రకటించు కున్నారు. అది కూడా అమెరికా చట్టం నిబంధనలకు లోబడిమాత్రమే. ఆ వివరాలు అందుబాటులోనే ఉన్నాయి. ఉదాహరణకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సోషలిజానికి మద్దతుగా వీడియోలు పుస్తకాలు ప్రచురించే ట్రైకాంటినెంటల్‌ బాధ్యుడైన విజయప్రసాద్‌ భారీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ గల ఒక దాత సహకరిస్తుంటారని ట్వటర్‌లోనే పేర్కొన్నారు. కనుక ఇందులో రహస్యం గానీ, పరిశోధించితేల్చింది గానీ ఏమీ లేదు. ఒక కార్పొరేట్‌ సంస్థగా సింగం నెట్‌వర్క్‌ న్యూస్‌క్లిక్‌కు తోడ్పాటునివ్వడం కూడా చట్టబద్దమే. తమకు ఏ దేశ ప్రభుత్వంతో గానీ, పార్టీతో గాని సంబంధం లేదని, ఎవరి నిధులు తీసుకోవడం జరగలేదని అటు సింగం, ఇటు న్యూస్‌ క్లిక్‌ సంపాడకుడు ప్రబీర్‌ అధికారులకు స్పష్టంగా చెప్పేశారు. ‘మా అభిప్రాయాలు పంచుకునే వారికి సహాయం చేసినా ఎక్కడా నేను వాటిని అదుపు చేయడం లేదని’ సింగం స్పష్టం చేశారు. ‘నా వయసు నాకున్న అవకాశాల దృష్ట్యా విస్త్రతంగా సహాయపడాలని నిర్ణయించుకున్నాను’ అని ప్రకటించారు. అందులో భాగంగానే తన కంపెనీ థాట్‌వర్క్స్‌ను కూడా అమ్మేశారు. ఆ పత్రాలు లెక్కలు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఇక్కడ మీడియావారు చేసిందల్లా అవేవో రహస్య విషయాలుగా చూపడమూ కథనం రాసిన న్యూయార్క్‌ టైమ్స్‌ దృష్టిలో శాంతి, సోషలిజాల కోసం పనిచేయడం సహకరించడం మహాపరాధం. ఉదాహరణకు చైనా కమ్యూనిస్టుపార్టీ శ్రామిక వర్గ విప్లవం ఇప్పటికీ ప్రపంచాన్ని ఉత్తేజపరుస్తూనే ఉందని న్యూస్‌క్లిక్‌లో రాయడం కూడా చైనా అనుకూలత అట. మనదేశంలోనే గాక ప్రపంచ వ్యాపితంగా రష్యా, చైనా, వియత్నాం విప్లవాలను అభినందించడం మనకు తెలుసు. అలాగే కరోనాకు తొలుత గురైన దేశంగా చైనా ఎలా ఎదుర్కొన్నదనే విషయం చాలా పత్రికలు రాశాయి. చైనా నుంచే కరోనా వైరస్‌ వచ్చిందనే కట్టుకథలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధికారికంగా ధృవీకరించలేదు. (ఆ మాటకొస్తే ఢిల్తీలోని తబ్లీగే జమాయిత్‌లో ముస్లింలు కావాలని దీన్ని పెంచారని సాగిన కవ్వింపు ప్రచారాలను తర్వాత కాలంలో సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది.)
అబద్దాలు అభాసుపాలు
అమెరికా మార్క్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతతో వండివార్చిన ఈ కథనమే పెద్దసాకుగా తలపోశారు బీజేపీ పాలకులు. అంతేగాని ఇక్కడ వారు పరిశోధనాత్మక జర్నలిజంతో కనిపెట్టింది శూన్యం. దుష్ప్రచారమే కనిపెట్టారు. బీజేపీ ఎంపి నిశికాంత్‌ దూబే, మంత్రులు అనురాగ్‌ ఠాగూర్‌, పీయుష్‌ గోయెల్‌లు పార్లమెంటులోనూ బయటా కూడా తలాతోక లేని ఈ కథనం బట్టుకుని సీపీఐ(ఎం)పైన, కాంగ్రెస్‌పైన విషంకక్కారు. (ఒకప్పుడు తమ హయాంలో సీపీఐ(ఎం) ఏర్పడుతన్న దశలోనే చైనా అనుకూల ముద్రవేసి వేలమందిని అరెస్టులు చేసిన కాంగ్రెస్‌కు కూడా అదే అనుభవంలోకి వచ్చి ఉండాలి) ఈ దేశద్రోహ ప్రచారంపై పార్లమెంటులో తీవ్ర నిరసనతో పాటు సభా హక్కుల నోటీసు కూడా ఇచ్చాక పియూష్‌ గోయెల్‌ వంటివారు తోకముడిచారు. ప్రకాశ్‌కరత్‌పై అభాండాలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. సభలో సభ్యుడు కాని వారిపై ఆరోపణలు చేయరాదనే ప్రాథమిక మర్యాదను సంప్రదాయాన్ని కూడా బీజేపీ మంటకలిపిందని పేర్కొంది. తన హిందూత్వ మతోన్మాద రాజకీయాలపై వామపక్షాలు గట్టిగా పోరాడుతున్నాయి గనకే ఈ విధమైన అసత్య ప్రచారాలకు దిగినట్టు స్పష్టం చేసింది. న్యూస్‌క్లిక్‌ తరపున ప్రబీర్‌ పురకాయస్త కూడా సూటిగా సమాధానమిచ్చారు. కొందరు రాజకీయ పాత్రధారులు, కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి వాస్తవాలు చట్టబద్దత లేకుండా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. తమ మలివిడత దుష్ట్రచారం తేలిపోవడంతో ఇప్పుడు మరోసారి ఈడీని రంగంలోకి దించి ప్రబీర్‌ ఇంటిని స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వదులుతున్నారు. వాటిపై ఆ సంస్థ పోరాటం సాగిస్తున్నది కూడా. ఇందుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశిచించినట్టు కూడా అదేపనిగా వార్తలు ఇస్తున్నారు. చట్ట పరిధిలో అవసరమైన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వారు ఎన్నడూ నిరాకరించింది లేదు. ఆ అవసరం అంతకన్నా ఉండదు. ఎటొచ్చి జాతీయంగా, అంతర్జాతీయంగా దుర్మార్గ రాజకీయాలనూ, దుస్తంత్రాలను నిక్కచ్చిగా ఎదుర్కొనే వారిపై పాలకుల దాడి కొత్త కాదు. వైర్‌, న్యూస్‌క్లిక్‌ వంటివి అందుకు పదునైన ఆయుధాలుగా ఉన్నాయి గనకే ఈ దాడి సాగదీస్తున్నారు. తీస్తా సెతల్వాద్‌నూ అలాగే వేటాడటం చూస్తున్నాం. ఆమెతో పాటు గౌతమ్‌ నౌలఖే వంటివారి వివిధ సేవలకు ఈ ఖాతాల నుంచి మొత్తాలు జమపడితే అందులో ఏదో అక్రమం జరిగినట్టు చూపేందుకు అవస్థలు పడుతున్నారు. దేశ సంపదనూ, విశాఖ ఉక్కు వంటి మహాసంస్థలనే అదానీలకు అప్పగిస్తూ వారిపై ప్రపంచ స్థాయిలో వచ్చిన తీవ్ర ఆరోపణలను, కుంభకోణాలను కప్పిపుచ్చుతున్న మోడీ సర్కారు ప్రజల కోసం పోరాడే ప్రజాస్వామిక వాదులపైన, సంస్థలపైన అభాండాలు వేస్తూ అణచివేయాలనుకోవడం హాస్యాస్పదం. పలు మీడియా సంస్థలూ, మేధావులు న్యూస్‌క్లిక్‌పై దాడిని ఖండిస్తూ ముందుకు రావడం హర్షనీయం.
తెలకపల్లి రవి

Spread the love