రాగం మారింది…

నిన్న మొన్నటి వరకు గవర్నర్‌ హోదాలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారంటూ విమర్శలు మూటగట్టుకున్న తమిళిసై సౌందరరాజన్‌ ఇప్పుడు సుస్వరాల సన్నాయి రాగం అందుకొని సర్కారును సమ్మెహితం చేస్తూ, ఆహా…ఓహో అంటూ నొక్కి’వణక్కం’ అనేస్తున్నారు. ఇక ఆమెపై ఆ విమర్శలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు కూడా కొత్త పల్లవి అందుకొని, గవర్నర్‌ను వేనోళ్ల పొగిడేస్తున్నారు. గవర్నర్‌గిరీ పూర్తయ్యి నాలుగేండ్లయిన సందర్భంగా తమిళిసై ‘కాఫీ టేబుల్‌’ అంటూ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ నుంచి చాలా నేర్చుకున్నానంటూ ‘తామంతా ఒకతానులో ముక్కలమే’ అని స్పష్టత ఇచ్చేశారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ప్రజలకు… ముఖ్యంగా గిరిజనానికి వైద్యమందట్లేదని గుండెలు బాదుకున్న గవర్నర్‌… ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో వైద్యారోగ్యం భేష్‌ అని కితాబిచ్చేశారు. అసలు ఈ సంధి కుదుర్చుకోవడం కోసమే పట్నం మహేందర్‌రెడ్డి మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం పెట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే అక్కడి నుంచే గవర్నర్‌, సీఎం మధ్య సయోధ్య రాజకీయం చెట్టాపట్టాలేసుకుంది. నిన్నటిదాకా ఒకరిలో ఒకరికి కనిపించిన తప్పులన్నీ ఇప్పుడు మాఫ్‌ అయిపోయి, ‘అంతా ఓకే’ అని నల్లకళ్లద్దాల్లోంచి స్టేట్‌మెంట్లు ఇచ్చే స్థితికి బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఫెవికాల్‌ బంధం ధృడపడినట్టుంది… అంతేనంటారా సారూ… సారీ… మేడమ్‌!! – ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

Spread the love