నేనొచ్చేశా…

శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జోరువాన. రోడ్లన్నీ జలమయం. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జాం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ దగ్గర మాత్రం ఓ యాభై మంది యువతీ యువకులు డప్పు చప్పుళ్లు, మేళ తాళాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ వెలుగులు, బాణాసంచా పేలుళ్ల మధ్య ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తున్నారు. వారికి ముందు ఓ పది వాహనాలు, వెనుక మరో పది వాహనాలు. అదేదో పెద్దోళ్ల ఇంట్లో పెండ్లి లేదా మరేదైనా వేడుక అనుకున్నా. అలా ఆ రద్దీని తట్టుకుంటూ, తోసుకుంటూ కొంచెం ముందుకెళితేగానీ అసలు విషయం అర్థం కాలేదు. అక్కడి కోలాహలం ఏదో పెండ్లో, వేడుకకు సంబంధించింది కానే కాదు. మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోయే వినాయక చవితి సందర్భంగా ‘బొజ్జ గణపయ్య’ నేనొచ్చేశానంటూ చేస్తున్న హడావుడి అదంతా. అద్భుతమైన రంగులతో ఉన్న గణేషుడి విగ్రహాన్ని ఓ భారీ వాహనంలో తరలిస్తున్నారు. అందుకే ఈ హంగామా. అయితే గతంలో హైదరాబాద్‌లో, మరేదైనా జిల్లాలోగానీ వినాయక చవితి వేడుకలు పూర్తయిన తర్వాత… నిమజ్జనం రోజున్నే ఇలా విగ్రహాలను తరలించే సంప్రదాయం ఉండేది. కానీ అందుకు భిన్నంగా ఈసారి కొత్త ఆనవాయితీకి తెరతీస్తూ పండుగ ప్రారంభానికి ముందే ప్రదర్శనగా తీసుకెళ్లటం కొంగొత్తగా అనిపించింది.
-కేఎన్‌ హరి

Spread the love