మేమేంగావాలె…

‘ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి…’ అధికార బీఆర్‌ఎస్‌ వైఖరి ఇప్పుడు ఇలాగే ఉంది. ఆ పార్టీ పుట్టి దాదాపు ఇరవై రెండేండ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా గులాబీ బాస్‌ కేసీఆర్‌ వెంట ఉద్యమంలోను, ప్రభుత్వంలోనూ నడిచిన నాయకులు వందల మంది ఉన్నారు. సరే.. ఉద్యమం ముగిసి కారు పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2018 వరకూ ఉన్న కేసీఆర్‌ మొదటి గవర్నమెంటులో పదవుల కోసం చూసి చూసి ఆ పాతకాపుల ముఖాలు వాడిపోయాయి. సర్లే… అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వలేరు కదా..? అని అప్పటికి వారు సరిపెట్టుకుని సర్దుకుపోయారు. ఆ తర్వాత 2018 నుంచి ఇప్పటివరకూ రెండో గవర్నమెంటు కొనసాగింది. ఈ సారి కూడా సారు వారిని కనికరించలేదు. అలా ఆయన కనికరానికి దూరమైన వారిలో కొంతమంది కాలం చేశారు, మరికొంత మంది వయసు మీద పడి వృద్ధాప్యంలో ఉన్నారు. ఇంకొంత మంది నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరి దీనస్థితి ఇట్లుంటే.. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి, బీజేపీ నుంచి జంప్‌ అయి… కారెక్కిన నేతలకు మాత్రం పదవులు తన్నుకుని వస్తుం డటం గమనార్హం. ఈ ఘోరాన్ని కారు పార్టీలోని పాతతరం నేతలు అస్సలు జీర్ణించుకోలేక పోతు న్నారట పాపం.. ‘కొత్తగొచ్చిననోళ్లకు పదవులు ఇచ్చుకుంటా పోతే.. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీ లో ఉండి, సేవచేస్తున్న మేమేం గావాలి…?’ అంటూ వారు తెగ ఆవేదన పడిపోతున్నారు.
– కె.నరహరి

Spread the love