– గ్రామస్థాయిలో గులాబీ సైన్యం సన్నద్ధం
– కార్యక్రమాల్లో వేగం పెంచిన మెచ్చా వర్గం
– బీఎల్ఏలకు ఘన సన్మానం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా బీఆర్ఎస్‌లోని మెచ్చా వర్గం నాయకులు కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఓటరు జాబితా సంబంధిత కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసి అధిక శాతం పనులు పూర్తి చేసిన బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు)ను గ్రామాల వారీగా ఘనంగా సన్మానించారు.
మండల కోఆర్డినేటర్ జూపల్లి రమణారావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్‌మూర్తి, సీనియర్ నాయకులు మోహన్‌రెడ్డి, యూఎస్ ప్రకాష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు సంక ప్రసాద్, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బీఎల్ఏ తగరం జగన్నాధం ను శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గ్రామస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
అశ్వారావుపేట మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



