సర్పంచ్ తో వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్ నేతలు

– గ్రామ పంచాయితీలోనే కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్యే చల్లా కు క్షీరాభిషేకం చేయాలంటూ పట్టుపట్టారు..
నవతెలంగాణ-ఆత్మకూర్
ఆత్మకూర్ మేజర్ గ్రామ పంచాయితీకి రాష్ట్ర ఉత్తమ అవార్డు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ నేతలు సర్పంచ్ పర్వతగిరి రాజుతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ పర్వతగిరి రాజు పాలక మండలి సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేయడం ద్వారానే ఉత్తమ అవార్డు వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు ఇక్కడనే క్షీరాభిషేకం చేయాలంటూ సర్పంచ్ తో వాగ్వాదానికి దిగారు. ఉదయమే బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం ఫోన్ చేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన (ఈజీఎస్) నిధులతోనే గ్రామం ఆదర్శంగా అభివృద్ధి జరిగిందని ప్రధాన మంత్రి చిత్ర పటానికే క్షిరాభిషేకం చేయాలనీ బీజేపీ నేతలు పట్టు పట్టారని సర్పంచ్ బీఆర్ఎస్ నేతలకు వివరించారు. ఇక్కడ ఎవరి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయవద్దని ఒకరికి అవకాశమే ఇచ్చి మరొకరి ఇవ్వకుంటే గొడవలు అవుతాయని మనమందరం పార్టీలకు అతీతంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ నేతలను సర్పంచ్ రాజు కోరారు. మీరు నాకు సహకరించాలని క్షీరాభిషేకం గ్రామ పంచాయితీ బయట చేసుకోవచ్చని చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి పంచాయతీ సిబ్బందిని శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కానుగంటి సంపత్ కుమార్, ఉప సర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి, భాషాబోయిన సదానందం, పూజారి రాము, పాపని రవీందర్, భాషాబోయిన పైడి, పొగాకుల సంతోష్, రేవూరి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love