బీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలి

బీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలి– తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలి
– చాడ, జస్టిస్‌ చంద్రకుమార్‌, అజీజ్‌పాషా, పాశం యాదగిరి పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యమ ఆకాంక్షలను పాతరేసి నిరంకుశ విధానాలను అవలంభిస్తున్న బీఆర్‌ఎస్‌ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, జస్టిస్‌ చంద్రకుమార్‌, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌ మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఆత్మగౌరవ పరిపాలనలేదన్నారు. సీఎంను మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో పదేండ్లుగా నిరంకుశ పరిపాలన సాగుతోందన్నారు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టపోతామని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టాల్సిన అవసరముందన్నారు. ఆ పార్టీ గెలిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియమాకాల కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో 2.70 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని రూ.5.30 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయారని అన్నారు. రూ.1.30 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కుంగిపోయిందనీ, గతంలో కట్టిన నిజాంసాగర్‌, నాగార్జున సాగర్‌ లాంటి ప్రాజెక్టులు చెక్కుచెదరలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును, మిగతా 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓట్‌ నీట్‌ గ్యారంటీ సంస్థ అధ్యక్షురాలు సౌగ్రబేగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ, ఎన్‌ బాలమల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love