ముస్లిం దంపతుల దారుణ హత్య

Brutal murder of Muslim couple– యూపీలో మరో ఘాతుకం
లక్నో : యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ హయాంలో ముస్లిములపై దాడులు తీవ్రమయ్యాయి. తమ కుమార్తెను ముస్లిం యువకుడు తీసుకెళ్లి, వివాహం చేసుకున్నాడన్న కోపంతో హిందూ యువతి కుటుంబ సభ్యులు ముస్లిం దంపతులను దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ చక్రేష్‌ మిశ్రా తెలిపారు. ఆయన, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సీతాపూర్‌ ప్రాంతానికి చెందిన అబ్బాస్‌, కమ్రుల్‌ నిషాల కుమారుడు షౌకత్‌ అదే ప్రాంతానికి చెందిన రాంపాల్‌ కుమార్తె రూబీ ప్రేమించుకున్నారు.
2020లో మైనర్‌గా ఉన్న రూబీని 28 ఏళ్ల షౌకత్‌ అపహరించాడంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 13 నెలల జైలు జీవితం అనంతరం విడుదలయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో మళ్లీ షౌకత్‌, రూబీ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయమై కేసు నమోదైంది. అప్పటికే మేజర్‌ అయిన రూబీ షౌకత్‌కు అనుకూలంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. ఆ తరువాత వేరొక కేసులో షౌకత్‌ను రెండు నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. రాంపాల్‌ కుటుంబ సభ్యులు షౌకత్‌ తల్లిదండ్రులు అబ్బాస్‌, కమ్రుల్‌ నిషాలపై శుక్రవారం ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
దీంతో, అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని స్థానికులు చెప్పారని ఎస్‌పి తెలిపారు. గ్రామంలో పోలీసు బలగాలను మోహరించామని చెప్పారు. ఈ కేసులో రూబీ సోదరుడు, ఆమె బావ, ఆ కుటుంబ స్నేహితుడిని అరెస్టు చేశామని తెలిపారు. ఆమె తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

Spread the love