నవతెలంగాణ – అమృత్‌సర్: పంజాబ్‌లో మరోసారి పాకిస్థానీ డ్రోన్ పట్టుబడింది. అమృత్‌సర్ జిల్లాలోని భైనీ రాజ్‌పుతానా గ్రామం వద్ద ఓ డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దును దాటడాన్ని బీఎస్‌ఎఫ్ బలగాలు గుర్తించాయి. దీంతో దానిపై కాల్పులు జరిపిన సైనికులు నేలకూర్చారు. దానినుంచి ఓ కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2.1 కిలోల హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, గత నాలుగు రోజుల్లో అమృత్‌సర్ జిల్లాలోనే ఐదు డ్రోన్లు పట్టుబడటం విశేషం. మే 19 తర్వాత పాకిస్థానీ డ్రోన్లను కూల్చడం ఇది ఐదో సారని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. గత శుక్రవారం పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చిన రెండు డ్రోన్లను నేలకూల్చామని చెప్పారు. ఇక శనివారం రాత్రి పట్టుబడిన డ్రోన్ నుంచి 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.