టోలిచౌకిలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలో డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చి టోలిచౌకిలో అమ్ముతున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మఫ్టీలో కాపు కాసి నిందితుడు, అతని వద్ద ఉన్న హెరాయిన్‌ను పట్టుకొని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ప్రైవేటు ఉద్యోగ చేస్తూ హెరాయిన్ విక్రయిస్తున్నాడు. ఈ నెల 21న టోలిచౌకి ప్రాంతంలో అమ్ముతున్నట్టు ఎస్ఐ గణేష్ గౌడ్‌కు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ మఫ్టీలో ఇర్ఫాన్ వద్దకు వెళ్లి హెరాయిన్ కావాలని ట్రాప్ చేశారు. వినియోగదారుడు అనుకొని ఒక హెరాయిన్ ప్యాకెట్ ఎస్ఐ చేతిలో పెట్టాడు. వెంటనే ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద 8.56 గ్రాముల హెరాయిన్ దొరికింది. ముంబాయికి చెందిన గయాజ్ నుంచి కొనుగోలు చేసినట్లు ఇర్ఫాన్ తెలిపాడు. ఇర్ఫాన్, గయాజ్‌లపై నార్కోటిక్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గయాజ్ పరారీలో ఉండగా ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Spread the love