– తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య
నవతెలంగాణ-సూర్యాపేట
దళితుల జనాభా దామాషా ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో నిధులు కేటాయించి దళితుల అభివద్ధికి ఖర్చు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏఐఏడబ్య్లూ, కేవీపీఎస్, బీకేఎంయూ,డీఎస్‌ఎం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో”రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు, దళితులపై జరుగుతున్న దాడులు హత్యలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.భూమి లేని దళిత కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం భూమిలేని పేదలకు మూడెకరాల చొప్పున పంపిణీ చేయాలని కోరారు.ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రయివేట్ విద్య, వైద్యసంస్థలలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేకచట్టాలు తేవాలన్నారు.ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు మానుకోవాలని హితవుపలికారు.ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్‌టాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వాలే ప్రచార ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. దళిత,గిరిజన మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను నియంత్రించాలని కోరారు.కులాంతర వివాహాలు చేసుకున్న జంటల రక్షణ కల్పనకు ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యా సంస్థలలో కుల వివక్షత నిర్మూలనకు రోహిత్ వేముల చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు.దళిత, గిరిజనులు విదేశీ చదువుకు ఎంత ఖర్చయితే అంత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు.దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న జరిగే చలో ఢిల్లీకి దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రెమిడాల రాజు అధ్యక్షవర్గంగా వ్యవహరించిన ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బీకేఎంయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు, మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్, బీఎస్పీ జిల్లా నాయకులు దాసరి రాములు, రైతు కూలి సంఘం రాష్ట్ర కన్వీనర్ బుద్ధ సత్యనారాయణ, బహుజన మహాసభ జిల్లా అధ్యక్షులు నారబోయిన వెంకట్, ప్రజావిముక్తి సెంటర్ జిల్లా బాధ్యులు కరీం, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ నాగేందర్‌నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగ జానయ్య, ఆరే రామకష్ణారెడ్డి, తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం బీకేఎంయూ జిల్లా ఉపాధ్యక్షులు రావుల సత్యం, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.