తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు రావచ్చు: కేసీఆర్

నవతెలంగాణ – కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ పాలన చివరి దాకా ఉండేలా లేదని… మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ మన సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీళ్లిచ్చినం, కరెంట్ ఇచ్చినం, రైతు బంధు ఇచ్చినం, పంట కొన్నామని తెలిపారు. హుజురాబాద్ దళితులు ఆత్మ గౌరవంతో ఉన్నారని ఉద్ఘాటించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మాయ మాటలు నమ్మారని అన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సమస్య కాదని అన్నారు. పంట వేసేటప్పుడు రైతు బంధు ఇస్తారా.. పంట కోసేటప్పుడు ఇస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రూ. వెయ్యి కోట్ల కంపెనీ మద్రాస్ పోయిందని మండిపడ్డారు. నాలుగైదు నెలల్లోనే రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని అన్నారు. తమ హయాంలో పోని కరెంట్.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు ఉండట్లేదో ఆలోచించాలని చెప్పారు. గోదావరి నీళ్లు పోతే… తెలంగాణకు బతుకే లేదని కేసీఆర్ అన్నారు. ప్రధాని నీళ్లను పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తానంటే.. సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. కరీంనగర్‌ను బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఆయన ఎంపీ అయ్యాక జిల్లాకు ఏం ఓరగలేదని విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Spread the love