అభ్యర్ధికి గోప్యత హక్కుంది

అభ్యర్ధికి గోప్యత హక్కుంది– ప్రతీ విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికీ గోప్యత హక్కు ఉంటుందని, ముఖ్యమైనది అయితే తప్ప ప్రతి విషయాన్ని అభ్యర్థి వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ గోప్యత హక్కును కాపాడుకోవచ్చునని, అభ్యర్థి తన వ్యక్తిగత జీవితం, గతంలో ఉన్న, ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రతీ వస్తువు గురించి వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘ఒక అభ్యర్థి తనకు లేదా తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు దుస్తులు, పాదరక్షలు, టపాకాయలు, స్టేషనరీ, ఫర్నీచర్‌ వంటి ప్రతి చరాస్థినీ ప్రకటించాల్సిన అవసరం లేదు’ అని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సంజరు కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పులో పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఒక స్వతంత్ర శాసనసభ్యుడు దాఖలు చేసిన అప్పీల్‌లో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2019 ఎన్నికల సందర్భంగా ఈ ఎమ్మెల్యే గతంలో విక్రయించిన తన ‘చరాస్థులను’ గురించి అఫిడవిడ్‌లో వెల్లడించనందుకు స్థానిక హైకోర్టు అతనిపై అనర్హత వేటు వేసింది. గత ఏడాది జూలైలో గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎమ్మెల్యే కరిఖో క్రి ఈ పిటీషన్‌ వేశారు. 2019 మే 23న జరిగిన ఎన్నికలలో కరఖో క్రి స్వంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే క్రీ తన కైనెటిక్‌ జింగ్‌ స్కూటర్‌, అంబులెన్స్‌గా ఉపయోగించే మారుతీ ఓమ్నీ వ్యాన్‌, టీవీఎస్‌ స్టార్‌ సిటీ మోటార్‌సైకిల్‌. స్కూటర్‌ను 2009లో స్క్రాప్‌గా విక్రయించారు. అలాగే మరో రెండు వాహనాలు కూడా విక్రయించారు. వీటితో పాటు క్రి తన భార్య, కుమారుల ఆస్థి వివరాలను కచ్చితంగా వెల్లడించలేదని కొంత మంది హైకోర్టులో పిటీషన్‌ వేశారు. దీంతో హైకోర్టు అతనిపై నిషేధం విధించింది. దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును క్రి అశ్రయించారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రతి చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆ సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు ఉన్న ‘కచ్చితమైన’ హక్కేమీ కాదని వ్యాఖ్యానించింది. ‘అత్యంత విలువైన ఆస్తులు ఉండి, విలాసవంతమైన జీవన శైలిని ప్రతిబింబిస్తే తప్ప.. అభ్యర్థి, తన కుటుంబసభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. అభ్యర్థి తన ఎన్నికల అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు ఉందని తెలిపింది.

Spread the love