స్టే విధించేందుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్‌లను నియమించే చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఈ దశలో స్టే విధిస్తే గందరగోళానికి దారితీస్తుందని పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం ప్రకారం.. నియమితులైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులపై ఎటువంటి ఆరోపణలు లేవని కోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం కార్యనిర్వాహక అధికారి కింద ఉందని చెప్పలేమని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది కేంద్రం రూపొందించిన చట్టం తప్పు అని భావించలేమని, నియమితులైన వ్యక్తులపై కూడా ఎలాంటి ఆరోపణలు లేవని, ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికలు సమీపిస్తు న్నందున ఈ సమయంలో సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లు 2023ని గతేడాది పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రపతి ఆమోదం పొందింది. నూతన చట్టం ప్రకారం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్‌ మంత్రితో ఎన్నికల కమిష నర్‌లను ఎన్నుకునేందుకు కమిటీని రూపొం దించింది. దీంతో ఈ కమిటీ నిష్పాక్షితపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కమిటీ ఎంపిక అనంతరం లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ ఎంపిక ముందు రోజు తనకు పరిశీలన కోసం 212 పేర్లను ఇచ్చారని, సమావేశానికి ముందు ఆరు పేర్లతో షార్ట్‌లిస్ట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్త చట్టంతో కమిటీ ఎంపికను ‘లాంఛనప్రాయం’ చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ నోటిఫికేషన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. నకిలీ వార్తల సమస్యను పరిష్కరించేందుకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆధ్వర్యంలో (పిఐబి) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు బాంబే హైకోర్టు తీర్పుని పక్కన పెట్టింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు అర్హత గురించి ప్రస్తావించలేదు. ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌పై కేంద్రం నోటిఫికేషన్‌ను అడ్డుకోవాలని కోరుతూ.. స్టాండ్‌ అప్‌ కమిడియన్‌ కునాల్‌ కమ్రా, ఎడిటర్స్‌ గిల్డ్‌్‌ ఆఫ్‌ ఇండియా బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పిటీషనర్లు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేం దుకుగాను ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం గతే డాది ఏప్రిల్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌-2021కు సవరణలు చేసింది. అయితే,
ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

 

Spread the love