కరువు నిధులడిగితే కదలరేం?

If the drought funds Why not move?– ప్రతిదానికీ పేచీ పడే పరిస్థితి రానివ్వొద్దు
– కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సుప్రీం
– కర్నాటక అభ్యర్థనపై స్పష్టమైన ప్రకటనతో రండి : అటార్నీ, సొలిసిటర్‌ జనరల్స్‌ను ఆదేశించిన కోర్టు
న్యూఢిల్లీ : తీవ్ర కరువు, నీటి ఎద్డడితో అల్లాడుతున్న కర్నాటక జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నిధుల కోసం అభ్యర్థిస్తే కేంద్రం స్పందించకపోవడంపై సుప్రీం కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిదానికి పేచీ పడే పరిస్థితి రానివ్వొద్దని కోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. కేంద్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తూ పలు రాష్ట్రాలు తమ వద్దకు రావాల్సి వస్తోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కరువు నిధుల విడుదల కోసం ఎన్నిసార్లు కేంద్రాన్ని అభ్యర్థించినా ఫలితం లేకపోవడంతో కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం కరువు ఉపశమనానికి సంబంధించి కేంద్రం వైఖరిని తెలియజేస్తూ స్పష్టమైన ప్రకటనతో తదుపరి విచారణ తేది నాటికల్లా తమ ముందుకు రావాలని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకిటరమణ, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతానుద్దేశించి ధర్మాసనం ఆదేశించింది. కరువు నిధుల కోసం కర్నాటక చేసిన అభ్యర్ధనపై తగాదాపడే దాకా పరిస్థితి రానివ్వొద్దని కేంద్రానికి సూచించింది. ఇటీవల కాలంలో రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతుండడంతో వేరే గత్యంతరం లేక రాష్ట్రాలు సుప్రీం కోర్టునాశ్రయిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, కర్నాటక ఆర్థిక నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై కోర్టునాశ్రయించాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న సుప్రీం ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. ”కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదం వుండరాదు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు రావడాన్ని మేం చూస్తున్నాం.” అని పేర్కొంది. కనివినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలు, తుపాను వంటి రెండు ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడానికి అవసరమైన దాదాపు రూ.38వేల కోట్ల నిధుల జారీ విషయంలో కేంద్రం, తమ పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఇటీవలనే తమిళనాడు ప్రభుత్వం కేంద్రంపై ఫిర్యాదు చేసింది. అలాగే కేరళ కూడా తమ రుణ పరిమితుల వ్యవహారంలో ఏకపక్షంగా జోక్యం చేసుకుంటోందం టూ కేంద్రంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కేరళను ఆర్థిక ఎమర్జన్సీలోకి నెట్టివేస్తోందంటూ విమర్శించింది. తీవ్ర కరువుకాటకాలను ఎదుర్కొంటున్న తమకు జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి రూ.18,171.44 కోట్లు మంజూరు చేయాలంటూ ఆరు మాసాల క్రితం కేంద్రాన్ని కోరామని, కానీ కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదని కర్నాటక తన పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో పంటల నష్టం రూ.35,162.05కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపింది. కర్నాటక తరపు వాదనలు వినిపిస్తున్న డి.ఎల్‌.చందన మాట్లాడుతూ, 2023 ఖరీఫ్‌ సీజనులో 236 తాలుకాలకు గానూ 223 తాలుకాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించినట్లు తెలిపారు. గత జూన్‌లో మైనస్‌ 56శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. గత 122 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంబంధించి ఇది మూడవ అత్యంత తక్కువ వర్షపాతమని చెప్పారు. వివిధ పద్దుల కింద మూడు కరువు సాయం మెమోరాండాలు అందచేసామని చెప్పారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయకుండా కేంద్రం నిరాకరించడమన్నది రాజ్యాంగంలో 14, 21 అధికరణల కింద కర్ణాటక ప్రజలకు కల్పించబడిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుఉందని కర్నాటక తన పిటిషన్‌లో పేర్కొంది. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న అనంతరం రెండు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Spread the love