వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటం ప్రాధమిక, మానవ హక్కు

The fight against climate change is a basic human right– సుప్రీం రూలింగ్‌
– పరిశుభ్రమైన వాతావరణ కొరవడితే పలు హక్కుల ఉల్లంఘనలకు దారి తీస్తుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ : వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని రాజ్యాంగంలో ప్రత్యేక ప్రాధమిక హక్కుగా, మానవ హక్కుగా సుప్రీం కోర్టు గుర్తించింది. ”వాతావరణ మార్పుల వల్ల సంభవించే దుష్ప్రభావాలపై పోరాడేందుకు ప్రజలకు హక్కు వుందని ఇంకా స్పష్టీంగా వ్యక్తీకరించాల్సి వుంది. బహుశా ఈ హక్కు, అలాగే పరిశుద్ధ పర్యావరణ హక్కు ఈ రెండూ కూడా ఒకే నాణానికి రెండు కోణాలు వంటివి కావడం ఇందుకు లింగ సమానత్వం, అభివృద్ధి హక్కు వంటివి పలు హక్కులు దీనితో ముడిపడి వుంటాయని పేర్కొంది. వాతావరణ మార్పులకు సంబంధించి ఎలాంటి రుగ్మతలు లేని ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతి ఒక్క మానవుని ప్రాధమిక హక్కు, మానవ హక్కు అని స్పష్టం చేసింది. ఆరోగ్య పర్యావరణానికి సంబంధించిన హక్కు ఉల్లంఘించబడితే ఆ ప్రభావం అనేక హక్కులపై పడుతుందని, జీవన హక్కు, వ్యక్తిగత సమగ్రత, ఆరోగ్యం, నీరు, గృహ నిర్మాణం, సమాచార హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, ప్రాతినిధ్య హక్కు ఇలా ప్రతి ఒక్కదానిపైనా పడుతుందని కోర్టు పేర్కొంది. అసమానమైన ఇంధన అవకాశాలు మహిళలను, బాలికలను తీవ్రంగా దెబ్బతీస్తాయని, ఎలాంటి జీతం బత్తెం లేని ఇళ్ళల్లో పనులకు ఎక్కువ సమయం ఖర్చు పెట్టడం వల్ల వారి బాధ్యతలు కూడా పెరుగుతాయని పేర్కొంది.వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సమస్యలను కట్టడిచేసేందుకు కోర్టు ఒక సూచన కూడా చేసింది. సౌర విద్యుత్‌ పాత్ర ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
భారత్‌ తక్షణమే సౌర విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించింది. ఇందుకు మూడు కారణాలను పేర్కొంది. ఒకటి, రాబోయే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయంగా పెరగనున్న ఇంధన డిమాండ్‌లో భారత్‌ వాటా దాదాపు 25శాతం వుండొచ్చునని పేర్కొంది. రెండోది, విచ్చలవిడిగా వాయు కాలుష్యంతో పరిశుద్ధమైన ఇంధన వనరులు అవసరమవుతున్నాయని అంది. తగ్గుతున్న భూగర్భ జలాలు, క్షీణిస్తున్న వార్షిక వర్షపాతం మూడో కారణమని పేర్కొంది.

Spread the love