‘అందరికీ నాణ్యమైన విద్య’ అందించలేమా?

'Quality for all Can't provide education?వేద కాలంలో, రాచరిక పాలనలో కొందరికే పరిమితమైన విద్యను ప్రజాస్వామ్యం సార్వత్రీకరించింది. అందరికీ విద్య అనేది ఆధునిక ప్రజాస్వామ్య దేశాల లక్షణం. ‘ప్రపంచాన్ని మార్చడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య’ అని హక్కుల సూర్యుడు నెల్సన్‌ మండేలా అంటారు. భారతదేశం 75సంవత్సరాల అమృత ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో కూడా వందశాతం అక్షరాస్యతను సాధించడానికి ఆమడదూరంలో ఆగిపోయింది. ఆరు నుండి 14సంవత్సరాల లోపు వారందరికీ ఉచిత సార్వత్రిక విద్యను రాజ్యాంగం అమలులోకి వచ్చిన పది సంవత్సరాల లోపు అందించాలని ఆశించిన రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్‌ 45 ద్వారా ఆదేశ సూత్రాలలో పొందుపరిచారు. యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 1959 నవంబర్‌ 20న ఆర్టికల్‌ 29 ద్వారా 6 నుంచి 14సంవత్సరాలు అందరికీ విద్య హక్కుగా అందించాలని సూచించింది. భారతదేశంలో అర్థ శతాబ్దం పాటు అనేకమంది విద్యావేత్తలు, సామాజికవేత్తల కృషి ఫలితంగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21ఏ ఆర్టికల్‌ చేర్చడంతో విద్యా హక్కును ఈ దేశ పౌరులు పొందగలిగారు. కానీ నేటికీ 6 నుండి 14సంవత్సరాల పిల్లలు 1.3కోట్ల మంది బడి ముఖం చూడని వారు ఉన్నారనే వాస్తవం దేశం రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో తడబాటును తెలియజేస్తుంది.
విద్యాహక్కు చట్టం చేసి 13సంవత్సరాలు గడిచినప్పటికీ విద్యా హక్కును పొందలేని అభాగ్యులు దేశంలో నేటికీ ఉన్నారు. వీరిలో కూడా ఎస్సీ ఎస్టీలు ఆ తర్వాత బీసీలు అధిక శాతంగా ఉండడం శోచనీయం. బడిలో చేరిన పిల్లలు కూడా పదవ తరగతి లోపే 12.6శాతం మంది, ఎనిమిదో తరగతి లోపు 3శాతం మంది, ఐదో తరగతి లోపు 2శాతం మంది పాఠశాల వదిలి బాల కార్మికులుగా మారుతున్నారని యుడిఐఎస్‌ఇ 2021-22 నివేదిక చెపుతున్నది. పాఠశాలలో చేరిన పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అనేది ఎండమావి గానే మారిందని అసర్‌ రిపోర్టు 2022 ద్వారా స్పష్టం అవుతుంది. రెండవ తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవగలిగిన మూడవ తరగతి పిల్లలు 20.5శాతం, ఐదవ తరగతి పిల్లలు 42.8శాతం మంది మాత్రమే ఉన్నారు. 69.6శాతం మంది ఎనిమిదవ తరగతి పిల్లలు మాత్రమే చాలా సాధారణమైన టెక్ట్‌ని చదవగలుగుతున్నారు. మూడో తరగతి పిల్లలలో తీసివేతలు చేయగలిగిన వారు 25.9శాతం, 5వ తరగతి పిల్లలలో భాగాహారం చేయగలిగిన వారు 25.6శాతం, ఎనిమిదో తరగతి పిల్లలలో భాగాహారం చేయగలిగిన వారు 44.7శాతం మాత్రమే ఉన్నారని అసర్‌ రిపోర్టు తెలియజేస్తున్నది. ఈ రిపోర్టులోని అంకెలు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాల బాధ్యతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత, అదేవిధంగా 65.5శాతం పాఠశాలల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ తరగతులు ఒకే తరగతి గదిలో బోధించడం అనేది విద్య నాణ్యతలో లోపాలకు కారణాలు.
పేదలు అత్యధికంగా (22.89 కోట్ల మంది) ఉన్న దేశం భారత్‌ అని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలియజేస్తున్నది. సంపద పంపిణీలో తీవ్ర అసమానతలు విద్యాభివృద్ధికి ప్రధాన ఆటంకంగా ఉన్నాయి. నివేదిక ప్రకారం దిగువ నుంచి 50శాతం మంది ప్రజల వద్ద దేశ సంపదలో 3శాతం ఉంటే, మొదటి 30శాతం మంది వద్ద సంపదలో 90శాతం పోగుబడి ఉంది. అంతేకాక మొదటి పదిశాతం మంది దగ్గర 80శాతం సంపద పోగు పడిందంటే అసమానతలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది. మొదటి ఒక శాతం మంది దగ్గర 45.6శాతం దేశ సంపద కేంద్రీకృతమైంది. పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడానికి అవసరమైన 1.4లక్షల కోట్ల నిధిని మొదటి వందమంది బిలియనీర్లపై 2.5శాతం పన్ను వసూలు చేయడం లేదా మొదటి పదిమంది బిలియనీర్ల వద్ద 5శాతం చొప్పున పన్ను విధించడం ద్వారా రాబట్టవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం అసమానతలు మరింత పెంచే విధంగా ఉన్నాయి.
కొఠారి కమిషన్‌ సార్వత్రిక విద్యను సాధించడం కోసం జీడీపీలో ఆరుశాతం నిధులు కేటాయించాలని సూచించింది. కానీ ఇప్పటివరకు మూడు శాతానికి మించి నిధులను కేటాయించకపోవడం పాలకులకు రాజ్యాంగ లక్ష్యాల సాధనలో చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. బడ్జెట్లో అత్యధిక నిధులను కేటాయిస్తున్న కేరళ ప్రభుత్వం దేశంలోనే సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించిన మొదటి రాష్ట్రం. 1990లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకుని విద్యా రంగాల్లో ప్రయివేటీకరణను విధానాలు ప్రవేశపెట్టడంతో దేశంలోనే కుటుంబ ఆదాయంలో అధిక శాతం విద్యకు ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక ఈ ప్రయివేటీకరణ వలన సమానత్వాన్ని సాధించడానికి బదులు విద్యలో అసమానతలు ఆర్థిక అసమానతలకు కారణంగా మారింది. రాష్ట్రంలో జీఓ117 పేరుతో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయ పోస్టుల కుదింపును దీనిలో భాగంగానే చూడాలి. పాఠశాల స్థాయిలో బాలికలు బడిమానేయడానికి పాఠశాలలో టాయిలెట్ల సౌకర్యం లేకపోవడం, పాఠశాల అనంతరం ఇంటి పనులు చేయవలసి రావడం, బాలికల రక్షణకు సంబంధించిన ఆందోళన వంటివి కారణాలుగా ఉన్నాయి. విద్యార్థుల మధ్య డిజిటల్‌ విభజన కూడా విద్యా అసమానతలకు కారణం అవుతున్నది.
మానవాభివృద్ధి సూచీలో 191 దేశాల్లో 132వ స్థానానికి భారతదేశం పడిపోవడం అనేది దేశ నిజమైన అభివృద్ధిని సూచించదు. దేశ అక్షరాస్యతను వంద శాతం పెంచడానికి, అందరికీ విద్య నుండి అందరికీ నాణ్యమైన విద్య దిశగా పయనించడానికి ప్రధాన అవరోధాలుగా ఉన్న సంపద పంపిణీని సరిచేయటం, విద్యా రంగానికి జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించడం చేయాలి. లింగ వివక్షత రూపుమాపడం, పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు పూరించడం, టాయిలెట్ల వంటి ప్రాథమిక సౌకర్యాలను పెంచడం ద్వారా మాత్రమే భారతదేశం నిజమైన అభివృద్ధిని సాధించగలదు.
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)
– జి.వెంకటేశ్వరరావు,సెల్‌ : 9966135289

Spread the love