ఫిబ్రవరి 16న కార్మికుల గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి..

నవతెలంగాణ మునుగోడు: కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసన గా ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు కోరారు గురువారం మండల కేంద్రంలోని ఎర్ర గోపాల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలాగా పనిచేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతూన్నారని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో లక్షల కోట్ల రుణాలు తీసుకున్నటువంటి విజయ్ మాల్యా, నీరో మోడీ, లలిత్ మోడీ ఇలా అనేకమంది 12 లక్షల కోట్ల బ్యాంక్ రుణాలను కరోనా కాలంలో మాఫీ చేస్తూ వారికి ఊరటను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కార్మిక వ్యవసాయ కార్మికులకు రైతులకు మొండి చెయ్యి చూపించిందని అన్నారు. రాబోయే ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి ఎలా రావాలని ఎత్తుగడలో భాగంగా దేశంలో మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రైతులు కార్మికులు వ్యవసాయ కూలీల ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.
ఈ చర్యలను వెనక్కి కొట్టాలంటే దేశంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో జరిగిన రైతాంగ పోరాట స్ఫూర్తితో నేడు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఆదివాసీలు కలిసి కేంద్ర ప్రభుత్వ తీరుపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి మండల కమిటీ సభ్యులు చికూరి బిక్షం , సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జిల్లాపెళ్లి యాదయ్య , ప్రజానాట్యమండలి మండల కమిటీ సభ్యులు పగిళ్ల యాదగిరి తదితరులు ఉన్నారు .

Spread the love