గొర్రెల మేకల పెంపకందారులను ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

– జీఎంపీఎస్‌ జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు
నవతెలంగాణ-గుండాల
గొర్రెల మేకల పెంపకందారులను ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు అన్నారు.శనివారం గుండాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం ఏడేళ్లు గడచినా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో గొర్రెలు రాని 13000 మంది,గుండాల మండలంలో 836 మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయని పక్షంలో గ్రామాల్లో ఓట్ల కోసం వచ్చే బీఆర్‌ఎస్‌ నాయకులను సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.గొర్రెల పంపిణీ పథకం అమలులో ప్రభుత్వానికి పారదర్శకత, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అమలులో విఫలమయిందని విమర్శించారు. దుబ్బాక,హుజురాబాద్‌, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల ఉపఎన్నికలు జరిగినప్పుడల్లా ఆయా నియోజకవర్గాలకు మాత్రమే గొర్రెల పంపిణీ పరిమితం చేసి గొల్ల,కురుమలను ఓట్ల కోసం మభ్యపెట్టిండ్రు తప్ప పథకం అమలులో ప్రభుత్వానికి కొంచెమైన చిత్తశుద్ధి లేదని అన్నారు.మండలంలోని పశు వైద్యశాలల్లో పనిచేస్తున్న వెటర్నరీ సిబ్బంది గొర్రెల కాపరులకు అందుబాటులో ఉండటం లేదని అన్నారు.559 జీవో ప్రకారం ప్రభుత్వ భూములను మేత కోసం కేటాయించాలని,వత్తిరీత్యా ప్రమాదాల్లో చనిపోయిన గొర్రె కాపరులకు 10లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని,ఉచిత గొర్రెల బీమా పథకం అమలు చేసి చనిపోయిన గొర్రె ఒక్కంటికి పదివేల రూపాయల నష్టపరిహారం,50 ఏండ్లు కలిగిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Spread the love