బోన్‌ మ్యారో సర్జరీతో తలసేమియాకు చెక్‌

– జిల్లాలో 8 మంది చిన్నారులకు చికిత్స విజయవంతం
– ప్రముఖ వైద్యులు ఎం.విజరు, డి.నారాయణమూర్తి
నవతెలంగాణ-ఖమ్మం
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు బోన్‌ మ్యారో సర్జరీతో ఉపసమనం కల్పించవచ్చని ప్రముఖ వైద్యులు ఎం.విజరు, డి.నారాయణ మూర్తి అన్నారు. తలసేమియాతో బాధపడుతున్న మహబూబాబాద్‌ జిల్లా నరసన్నపేటకు చెందిన జి.వీక్షిత్‌ (హెచ్‌ఎల్‌ఏ హాఫ్‌ మ్యాచ్‌), ఖమ్మంకు చెందిన జె.ఝాన్సీ(హెచ్‌ఎల్‌ఏ ఫుల్‌ మ్యాచ్‌) చిన్నారులకు బోన్‌మ్యారో చికిత్స విజయంతం అయి ఖమ్మంకు తిరిగి రాగా.. వారికి సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైద్యులు చిన్నారులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్‌ఎల్‌ఏ ఫుల్‌ మ్యాచ్‌తో పాటు హాఫ్‌ మ్యాచ్‌తో కూడా సర్జరీలు విజయవంతం కావడం చిన్నారుల అదృష్టం అన్నారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులను తలసేమియా ఫ్రీగా మార్చడానికి చేస్తున్న కృషిని అభినందించారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు రవిచందర్‌ మాట్లాడుతూ బెంగుళూర్‌ సంకల్ప్‌ ఇండియా ఫౌండేషన్‌ సహకారంతో తమ సంస్థ చిన్నారులకు బోన్‌ మ్యారో చికిత్స చేయిస్తుందని, ఇప్పటి వరకు 8 మంది చిన్నారులు తలసేమియా ఫ్రీగా మారారని అన్నారు. తలసేమియా రహిత సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కృషితో అడుగులు పడుతున్నాయని, వ్యాది నిర్మూలనకు మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో తలసేమియాతో చిన్నారిని జన్మించవద్దనేదే తమ లక్ష్యం అని, అందుకోసం వ్యాధిపై విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షురాలు పి.పావని, పి.ఉదరుభాస్కర్‌, పి.అనిత, ఎన్‌.ఉపేందర్‌, తలసేమియా చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love