40శాతం పిట్‌మెంట్‌తో పీఆర్సీ సిఫార్సు చేయాలి

– పీఆర్సీకి విశ్రాంత ఉద్యోగుల సంఘం వినతి
నవతెలంగాణ-సత్తుపల్లి
పెరుగుతున్న ధరలు, విద్య, వైద్యం వంటి ఇతర ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 2023 జులై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ పిట్‌మెంట్‌ను ప్రస్తుతం ఉన్న డీఏకు 2023 జులై నాటికి పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను కలిపి 40శాతం పిట్‌మెంట్‌తో విశ్రాంత ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం సత్తుపల్లి యూనిట్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేశవరెడ్డి, బద్రుద్దిన్‌ పీఆర్సీ కమిటీకి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ పిట్‌మెంట్‌ విశ్రాంత ఉద్యోగులకు ఎంత శాతం వరకు ప్రకటించడం ద్వారా ఆయా కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందనే విషయమై పీఆర్సీకి ప్రతిపాదిం చనున్న అంశాలను ఆ సంఘం శుక్రవారం పత్రికలకు వెలువరించింది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. పెన్షన్‌ క్యుముటేషన్‌ 15 యేండ్ల నుంచి 12యేండ్లకు తగ్గించాలన్నారు. విద్యాశాఖలో 1984 నుంచి తెలంగాణ ప్రాంతంలో పని చేసిన సుమారు 11వేల మంది స్పెషల్‌ టీచర్లకు ఏపీ జీవో నెం 28 ప్రకారం నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలన్నారు. కాలనుగుణంగా పెరిగిన ధరలను బట్టి ప్రస్తుతం దహన సంస్కారాలకు ఇస్తున్న ఖర్చు రూ. 30వేలను రూ.50వేలకు పెంచాలన్నారు. వీటితో పాటు పలు రకాల సౌకర్యాలు, పెంపుదలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం పే రివిజన్‌ కమిటీ (పీఆర్సీ)ని కోరింది.

Spread the love