బీజేపీలో కుమ్ములాట

నవతెలంగాణ లక్నో: మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఘర్షణ చెలరెగింది. ఏకంగా సభ్యులు  ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ బోర్డు సమావేశం (Shamli Municipal Councils Fight) రచ్చరచ్చగా మారింది. రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రాజెక్టులపై చర్చించేందుకు సభ్యులు భేటీ అయ్యారు. అయితే అధికారంలో ఉన్న బీజేపీ సభ్యులే కొట్టుకున్నారు. బెంచీలు ఎక్కి మరీ తన్నుకున్నారు. ఒకరిపై మరొకరు పంచ్‌లు ఇచ్చుకున్నారు. మున్సిపల్ చైర్మన్ అరవింద్ సంగల్, ఎమ్మెల్యే ప్రసన్ చౌదరి సమక్షంలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ సభ్యులు కొట్టుకోవడాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.
 బీజేపీ అంతర్గత కుమ్ములాటలకు ఇది నిదర్శనం : అఖిలేష్‌ యాదవ్‌
ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఒక వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సంఘటన స్థానిక పాలనా పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోందని విమర్శించారు. అలాగే అధికార బీజేపీలో విభేదాలు, వర్గాలను హైలైట్ చేస్తోందని ఎద్దేవా చేశారు. ‘ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, సమీక్షా సమావేశంలో ఇంకేం చర్చ జరిగింది? కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం ఎందుకు జరిగింది?’ అని ప్రశ్నించారు. బీజేపీ పాలనకు ఈ సంఘటన గుణపాఠమని అన్నారు. ‘భద్రతా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సమీక్షా సమావేశానికి రండి’ అని వ్యాఖ్యానించారు.

Spread the love