పొంగులేటి – బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఘర్షణ

– ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా వివాదం
– మాజీ ఎంపీ వర్గీయునిపై దాడి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గీయులు, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎంపీ వర్గీయుడు చీకటి కార్తీక్‌ పై బీఆర్‌ఎస్‌ యువజన విభాగానికి చెందిన కొందరు ఖమ్మంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ లో దాడి చేశారు. పూర్వాపరాల్లోకి వెళ్తే… గత ఆదివారం నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మంత్రిపై బచ్చాగాణ్ని నిలబెట్టి గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. ఆ మరుసటి రోజు మంత్రి, మాజీ ఎంపీని పిట్టలదొరగా అభివర్ణించడంపై కార్తీక్‌ సోషల్‌ మీడియా వేదికగా అజయ్ పై విరుచుకు పడ్డాడు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేత దేవభక్తుని కిషోర్‌ ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్లలో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా పొంగులేటి బైక్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ప్రారంభించేందుకు ముందస్తు ఏర్పాట్ల కోసం తన వర్గీయులను పంపించారు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం ఎన్టీఆర్‌ జయంతి వేడుకల ఏర్పాట్ల కోసం రామారావు విగ్రహం వద్దకు చేరారు. ఈ క్రమంలో దేవభక్తిని కిషోర్‌, చీకటి కార్తీక్‌ తారసపడ్డారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలై.. ఘర్షణకు దారితీసింది. కార్తీక్‌ పై కిషోర్‌, మరికొందరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. కిందపడేసి తన్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఖమ్మం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ కు కార్తీక్‌ ను తీసుకెళ్లారు. అక్కడి నుంచి కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనపై ఇంకా ఎటువంటి పోలీస్‌ కేసు నమోదు కాలేదు. గొడవ అనంతరం పొంగులేటి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి వెళ్లారు. ఏపీ సీఎం జగన్‌ అనుచరుడైన పొంగులేటి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తాకడంతో అది మైల పడిందని నందమూరి అభిమాన సంఘం నేతలు పాలతో శుద్ధి చేయడం గమనార్హం.

Spread the love