మూతబడిన పాఠశాలలను పునః ప్రారంభించాలి: చిక్కాల సతీష్ 

నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన పాఠశాలలను తిరిగి పునః ప్రారంభించాలని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు సోమారపు ఐలయ్య అన్నారు. బుధవారం టీపీటీఎఫ్ దశాబ్ది ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రంలోని ఎమ్మార్సీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షుడు సతీష్ టీపీటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పిల్లలు వచ్చే అవకాశం ఉన్న పాఠశాలలను మాత్రమే తెరిపిస్తామని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. అధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక కమిటీలు వేసి, మూతపడిన బడులను తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే స్కావెంజర్లను నియమించి, పాఠశాలల పరిశుభ్రతకు తోడ్పడాలన్నారు. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలని, మధ్యలో ఆగిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను నిర్వహించి విద్యాశాఖ పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ధరావత్ దేవేందర్ నాయక్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సూరం ఉపేందర్ రెడ్డి, కోట మురళి, కోట వెంకటేశం, బొగ సురేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love